Nagarkurnool: గురుకులాల్లో పేద విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా?: బీఎస్పీ నేతలు!

Nagarkurnool: శ్రీపురం ఎంజేపీ గురుకులంలో విద్యార్థి భరత్ యాదవ్ ఆత్మహత్యపై కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలి: బీఎస్పీ. లెక్చరర్ వేధింపులు, వసతుల లేమిపై ఆర్సీఓకు వినతిపత్రం అందజేత.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 19 Sept 2026 11:11 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: గురుకులాల్లో పేద విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా?: బీఎస్పీ నేతలు!

Nagarkurnool: శ్రీపురంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలలో విద్యార్థుల భద్రత, వసతుల పరిస్థితి, సిబ్బంది వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి తక్షణమే కళాశాలను సందర్శించి సమగ్ర విచారణ చేపట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) డిమాండ్ చేసింది.

ఈ రోజు బీఎస్పీ ఆధ్వర్యంలో శ్రీపురంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల కళాశాలను పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ అడ్వకేట్, పార్లమెంట్ ఇంచార్జ్ సి. కళ్యాణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ విద్యార్థి భరత్ యాదవ్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల నుంచి తమ దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం, లెక్చరర్ ప్రభాకర్ రెడ్డి విద్యార్థులను తీవ్రంగా వేధించేవారని, కొట్టడం, తన్నడం, బెంచీల మధ్యలో వేసి కొట్టడం వంటి ఆరోపణలు ఉన్నాయని నాయకులు తెలిపారు. విద్యార్థులపై ఇలాంటి ప్రవర్తన జరిగిందన్న ఆరోపణలపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

అదేవిధంగా లెక్చరర్ శంకర్ వ్యవహారశైలిపై కూడా విద్యార్థుల నుంచి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని బీఎస్పీ నాయకులు తెలిపారు. విద్యార్థులు తమ సమస్యలను ప్రిన్సిపాల్‌కు స్వేచ్ఛగా చెప్పుకోలేని పరిస్థితి ఉందని ఆరోపించారు.

భరత్ యాదవ్ మృతికి సంబంధించి తోటి విద్యార్థులు తమకు వెల్లడించిన విషయాలను కూడా నాయకులు ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలన్నింటిపై అధికారికంగా సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను నిర్ధారించాలని వారు డిమాండ్ చేశారు.

గురుకులంలో కనీస వసతులు కల్పించాలి

శ్రీపురం గురుకుల కళాశాలలో విద్యార్థులకు కనీస భద్రతా వసతులు కూడా సరిగా లేవని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. కిటికీలకు తలుపులు లేకపోవడం, బాత్‌రూమ్‌లలో లైట్లు లేకపోవడం, హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం వంటి సమస్యలను వారు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

అదేవిధంగా పాము కాటుకు గురైన ఓ విద్యార్థి ప్రస్తుతం నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, బాత్‌రూమ్‌లో తగిన వెలుతురు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని తమకు సమాచారం అందిందని నాయకులు తెలిపారు. ఈ ఘటనపై కూడా అధికారులు విచారణ జరిపి బాధ్యత ఎవరిదో తేల్చాలని కోరారు.

లెక్చరర్ ప్రభాకర్ రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్

విద్యార్థులపై వేధింపులకు సంబంధించిన ఆరోపణలు నిజమని విచారణలో తేలితే, లెక్చరర్ ప్రభాకర్ రెడ్డిని సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే ప్రిన్సిపాల్ కవిత, లెక్చరర్ శంకర్ తదితరులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు ఎంజేపీ ఆర్సీఓ శ్రీనివాస్ గౌడ్ గారికి బీఎస్పీ నాయకులు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కలెక్టర్, ఎంజేపీ గురుకులాల కార్యదర్శి స్వయంగా శ్రీపురం గురుకుల కళాశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి భరత్ యాదవ్ మృతికి సంబంధించిన అంశంతో పాటు గురుకులంలో విద్యార్థుల భద్రత, వసతుల సమస్యలపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ సభ్యులు శ్రీ హర్ష ముదిరాజ్, శాయిన్ పేట్ రాములు, నాయకులు దేవరపాగ రాముడు, జన్ను ఆంజనేయులు, అర్జున్, మహేష్ యాదవ్, ఆంజనేయులు, కె. రాములు, శ్రీనువాసులు, మల్లేష్, బీవీఫ్ అసెంబ్లీ కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL