Narayanpet: నారాయణపేటను మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Narayanpet: నారాయణపేట కలెక్టరేట్‌లో పొగాకు, మత్తు పదార్థాల నివారణ కమిటీ సమావేశం. అక్టోబర్ 28 నుండి డిసెంబర్ 28 వరకు 2 నెలల ప్రత్యేక అవగాహన డ్రైవ్: అదనపు కలెక్టర్ శ్రీను.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 10 Nov 2026 7:25 PM IST
Narayanpet
X

Narayanpet: నారాయణపేటను మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

నారాయణపేట: నారాయణపేట జిల్లాను పొగాకు, ధూమపానం, మత్తు పదార్థాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను అధికారులకు సూచించారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పొగాకు నియంత్రణ, మత్తు పదార్థాల నివారణకు సంబంధించి జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని అదనపు కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొగాకు వినియోగం, ధూమపానం, ఇతర మత్తు పదార్థాల అలవాట్లు వ్యక్తుల ఆరోగ్యంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత చిన్న వయస్సులోనే ఇటువంటి వ్యసనాలకు లోనుకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టళ్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిరోధించేందుకు సంబంధిత శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు కేవలం అవగాహన కల్పించడమే కాకుండా, వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

పొగాకు, ధూమపానం, మత్తు పదార్థాల వినియోగం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు తదితర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా క్రీడలు, విద్య, సామాజిక సేవ వంటి సానుకూల కార్యక్రమాల వైపు మళ్లించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.

గ్రామాలు, పట్టణాలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థలు, హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు, సమావేశాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాల ద్వారా ప్రజలకు సందేశాన్ని చేరవేయాలని సూచించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం, విక్రయాలపై సంబంధిత చట్ట నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లాలో అక్టోబర్ 28వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు రెండు నెలల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలు భాగస్వాములై తమ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, పోలీస్ శాఖ, సంక్షేమ శాఖలు పరస్పర సమన్వయంతో కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపారు.

పొగాకు, మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడం ఒక్క శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నారాయణపేట జిల్లాను పొగాకు, ధూమపానం, మత్తు పదార్థాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ కోరారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA