Narayanpet: ఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక!
Narayanpet: ఎల్ నినో ప్రభావంతో ఎండిన పంటలను నారాయణపేట జిల్లా కలెక్టర్ సి.హెచ్. ప్రియాంక స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు.
Narayanpet: ఎండిన పంటలను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక!
నారాయణపేట: నారాయణపేట జిల్లా... ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల కారణంగా పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల పరిస్థితిని పరిశీలించారు. నారాయణపేట మండల పరిధిలోని అప్పక్‌పల్లి, చిన్నజట్రం, కొల్లంపల్లి గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్ ఆయా గ్రామాలకు చెందిన రైతుల పంట పొలాలను సందర్శించి వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అప్పక్‌పల్లి గ్రామానికి చెందిన రైతు సాగు చేసిన వరి, టమాట, మిరప పంటలను కలెక్టర్ పరిశీలించారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలమట్టం తగ్గిపోవడంతో బోర్లలో నీరు అడుగంటిపోయి పంటలకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయిన పరిస్థితిని రైతు కలెక్టర్‌కు వివరించారు. ముఖ్యంగా వరి పంటకు అవసరమైన నీరు అందుబాటులో లేకపోవడంతో పంటను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
తాను ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నానని, పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతు తన ఆవేదనను కలెక్టర్‌కు వివరించారు. రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న కలెక్టర్ విచారం వ్యక్తం చేస్తూ, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
అనంతరం చిన్నజట్రం, కొల్లంపల్లి గ్రామాల్లో మరో ఇద్దరు రైతులు సాగు చేసిన వరి పంటలను కూడా కలెక్టర్ పరిశీలించారు. వర్షాలు లేకపోవడం, బోర్లలో నీటి లభ్యత తగ్గిపోవడంతో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. గత సంవత్సరం ఇదే సమయంలో వర్షపాతం ఎలా ఉందని, అప్పట్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేశారని, ప్రస్తుత పరిస్థితులతో పోలిస్తే దిగుబడులు, పెట్టుబడులు, ఆదాయంలో ఎంత తేడా వచ్చిందని రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు వర్షపాతంపై ప్రభావం చూపే అవకాశం ఉందని, వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కలెక్టర్ పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోందని, బోర్లలో నీటి లభ్యత తగ్గిపోవడం వల్ల ముఖ్యంగా అధిక నీటి అవసరం ఉన్న పంటల సాగు రైతులకు భారంగా మారుతోందని తెలిపారు.
రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక నీటి వినియోగం అవసరమయ్యే సంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని తెలిపారు.
రైతులకు అండగా ఉండేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల్లో పంటల పరిస్థితి, నీటి వనరుల లభ్యత, సాగు విస్తీర్ణం తదితర అంశాలను పరిశీలిస్తూ రైతులకు అవసరమైన వ్యవసాయ సలహాలు అందించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు నీటి పొదుపు పద్ధతులపై సూచనలు చేయాలని పేర్కొన్నారు.
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో రైతులకు సరైన సమయంలో వ్యవసాయ సలహాలు అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, మండల వ్యవసాయ శాఖ అధికారి, ఏఈ వోలు పాల్గొన్నారు.




