Narayanpet: రైతు రుణ వసూళ్లపై బలవంతం వద్దు: కలెక్టర్ ప్రియాంక!
Narayanpet: నారాయణపేట జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతు రుణాలపై మారటోరియం విధించాలని, బలవంతపు వసూళ్లు చేయరాదని కలెక్టర్ ప్రియాంక బ్యాంకర్లను ఆదేశించారు.
Narayanpet: రైతు రుణ వసూళ్లపై బలవంతం వద్దు: కలెక్టర్ ప్రియాంక!
నారాయణపేట: నారాయణపేట జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని వీసీ హాల్ లో బ్యాంకర్లతో నిర్వహించిన ప్రత్యేక జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ (స్పెషల్ డీసీసీ) సమావేశంలో ఆమె మాట్లాడారు.
జిల్లాలో గత 13 నెలలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణ వర్షపాతంతో పోలిస్తే 45 శాతం, గత ఏడాది వర్షపాతంతో పోలిస్తే సుమారు 65 శాతం లోటు వర్షపాతం నమోదైందని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో నారాయణపేట జిల్లా అత్యంత తీవ్రంగా వర్షాభావ ప్రభావానికి గురైన జిల్లాల్లో ఒకటిగా ఉందని పేర్కొన్నారు.
వర్షాభావం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వరి సాగు నుంచి పత్తి తదితర ప్రత్యామ్నాయ పంటల సాగుకు మారిన రైతులు కూడా పెట్టుబడులు పెట్టి ఆశించిన దిగుబడులు పొందలేకపోయారని తెలిపారు. ముఖ్యంగా పత్తి పంటలో సాధారణంగా ఎకరాకు సుమారు 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం నాలుగు నుంచి ఐదు క్వింటాళ్లకే పరిమితమవుతున్న పరిస్థితి ఉందని పేర్కొన్నారు. పంటల దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో సమీక్షించడంతో పాటు శాసనసభలో కూడా ఈ అంశంపై చర్చించిందని కలెక్టర్ వెల్లడించారు. రైతులు తీసుకున్న రుణాల చెల్లింపులపై మారటోరియం విధించడం, రుణాల పునర్వ్యవస్థీకరణ (రీషెడ్యూలింగ్) ద్వారా రైతులకు ఉపశమనం కల్పించే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు, బ్యాంకు మేనేజర్లు రైతులకు సంబంధించిన రుణాల విషయంలో ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతుల రుణాల వసూలు విషయంలో ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టరాదని, రుణాల చెల్లింపులపై మారటోరియం అమలు చేయడంతో పాటు, అవసరమైన చోట రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత బ్యాంకులు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
. జిల్లాలోని అన్ని బ్యాంకుల ప్రధాన అధికారులు, రీజినల్ మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు తమ పరిధిలోని అన్ని శాఖల మేనేజర్లకు ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. కేవలం ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా, శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలోని బ్యాంకు సిబ్బందికి కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను వివరించాలని సూచించారు.
ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని, రైతులకు మరింత ఆర్థిక భారం కలగకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జిల్లాలోని ప్రతి బ్యాంకు శాఖకు చేరేలా చర్యలు తీసుకుని, వాటిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
రైతుల సంక్షేమం, వారి ఆర్థిక భద్రతకు జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో బ్యాంకర్లు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్డీవో వెంకట్ రాములు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియ నాయక్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, లీడ్ బ్యాంక్ మేనేజర్ సురేష్ ఆత్రేయ, అన్ని బ్యాంకుల మేనేజర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.




