Narayanpet: కోస్గి సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలి: కలెక్టర్!

Narayanpet: నారాయణపేట జిల్లా కోస్గిలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.

P.HANMANTHU, NARAYANAPETA
Published on: 4 Nov 2026 11:34 PM IST
Narayanpet
X

Narayanpet: కోస్గి సైన్స్ మ్యూజియాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలి: కలెక్టర్!

నారాయణపేట: నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో రూ.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సర్ సీ.వీ. రామన్ సైన్స్ మ్యూజియాన్ని అన్ని హంగులతో త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోస్గి పట్టణంలోని సర్ సీ.వీ. రామన్ సైన్స్ మ్యూజియాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మ్యూజియంలో విద్యార్థులకు విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేస్తున్న వివిధ రకాల సైన్స్ పరికరాలను, వాటి అమరిక పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.మ్యూజియంలో సైన్స్ పరికరాల ఏర్పాటు, ఇతర మిగిలిన పనులన్నింటినీ మరో రెండు రోజుల్లో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్న సైన్స్ పరికరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులుకు సూచించారు.

అదేవిధంగా ప్రతి సైన్స్ పరికరం వెనుక భాగంలో దాని పేరు, ఉపయోగం, పనితీరు, శాస్త్రీయ సూత్రాలను వివరించేలా పెద్ద సైజు సమాచార చార్టులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. దీనివల్ల విద్యార్థులు సంబంధిత పరికరాన్ని పరిశీలిస్తూనే దాని పనితీరును చదివి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. సైన్స్ పరికరాలకు సంబంధించిన సమాచారం సరళమైన భాషలో, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండాలని పేర్కొన్నారు. అలాగే మ్యూజియం ఆవరణలో పరిశుభ్రతను పాటిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా గ్రీనరీని ఏర్పాటు చేయాలని, మొక్కలు నాటి పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మ్యూజియాన్ని సందర్శించినప్పుడు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగేలా పరిసరాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

మ్యూజియం ప్రారంభమైన అనంతరం పరికరాల పనితీరును విద్యార్థులకు వివరించేందుకు ప్రత్యేకంగా ఒక సైన్స్ అధికారిని నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. మ్యూజియాన్ని సందర్శించే విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలు, పరికరాల వినియోగం, శాస్త్రీయ అంశాలపై అవగాహన కల్పించే విధంగా అవసరమైన సిబ్బంది, నిర్వహణ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మ్యూజియంలో అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేసి, నిర్దేశించిన గడువులోగా మ్యూజియాన్ని ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్, ప్రజారోగ్య శాఖ ఎస్.ఈ. విజయ్ భాస్కర్, హైదరాబాద్ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి భానుప్రసాద్, కోస్గి మున్సిపల్ కమిషనర్ నాగరాజు, తహసీల్దార్ కళ్యాణి, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ఏఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

P.HANMANTHU, NARAYANAPETA

P.HANMANTHU, NARAYANAPETA