Narayanpet: ఆజాద్ ఆశయ సాధనకు కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీను!
Narayanpet: నారాయణపేట కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆజాద్ ఆశయాల సాధనకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను పిలుపునిచ్చారు.
Narayanpet: ఆజాద్ ఆశయ సాధనకు కృషి చేయాలి: అదనపు కలెక్టర్ శ్రీను!
నారాయణపేట జిల్లా: నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ విద్యారంగ అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను పిలుపునిచ్చారు. బుధవారం భారత తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, ఎస్డీసీ రాజేందర్ గౌడ్‌తో కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. దేశంలో విద్యావ్యవస్థ బలోపేతానికి, విద్యావకాశాల విస్తరణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్య ద్వారానే వ్యక్తి వికాసం, సమాజ అభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యమవుతాయని అన్నారు.
జాతీయ సమైక్యత, మతసామరస్యం, సమానత్వం వంటి ఉన్నత విలువల కోసం మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలన్న ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, విద్య ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్డీసీ రాజేందర్ గౌడ్, జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి ఎం.ఏ. రషీద్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, జిల్లా మత్స్యశాఖ అధికారి రెహమాన్, వివిధ శాఖల అధికారులు, మైనార్టీ సంక్షేమ శాఖ సిబ్బంది రషీద్, షమీమ్, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.




