Narayanpet: బాణసంచా దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
Narayanpet: నారాయణపేట జిల్లాలో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డా.వినీత్ హెచ్చరిక.
Narayanpet: బాణసంచా దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
నారాయణపేట: జిల్లా పరిధిలో బాణసంచా (టపాసుల) దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహించాలనుకునే వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ డా.వినీత్ సూచించారు. బాణసంచా దుకాణాల ఏర్పాటుకు సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ముందస్తు అనుమతులు, లైసెన్సులు పొందిన తర్వాతే విక్రయాలు ప్రారంభించాలని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పేలుడు పదార్థాల చట్టం–1884 (Explosives Act, 1884), పేలుడు పదార్థాల నిబంధనలు–2008 (Explosives Rules, 2008) ప్రకారం తాత్కాలిక లేదా శాశ్వత బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేయాలన్నా సంబంధిత లైసెన్సింగ్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి, లైసెన్స్ పొందడం తప్పనిసరి అని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసి బాణసంచా విక్రయాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బాణసంచా దుకాణాల యజమానులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలు, భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు సూచించారు.
బాణసంచా దుకాణాల వద్ద అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అగ్నిమాపక యంత్రాలు (Fire Extinguishers), ఇసుక బకెట్లు, నీటి బకెట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించడంతో పాటు దుకాణం వద్ద అందరికీ స్పష్టంగా కనిపించే విధంగా “పొగ త్రాగడం నిషేధం – NO SMOKING” బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయాలు నిర్వహించినా, నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు ఉంచినా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదకర పరిస్థితుల్లో దుకాణాలు ఏర్పాటు చేసినా సంబంధిత యజమానులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. బాణసంచా వ్యాపారులు పోలీస్, అగ్నిమాపక శాఖలతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల నిబంధనలు పాటిస్తూ అవసరమైన అనుమతులు పొందాలని కోరారు. పండుగల సమయంలో ఎలాంటి అగ్నిప్రమాదాలు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వ్యాపారులు, ప్రజలు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.




