Narayanpet: గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లవద్దు ఎస్పీ డా. వినీత్
Narayanpet: మల్టీ లెవెల్ మార్కెటింగ్, గొలుసుకట్టు స్కీముల పేరుతో సైబర్ మోసాలు. అధిక లాభాల ఆశతో మోసపోవద్దని నారాయణపేట జిల్లా ఎస్పీ డా. వినీత్ విజ్ఞప్తి.
Narayanpet: గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లవద్దు ఎస్పీ డా. వినీత్
నారాయణపేట: ప్రజల బలహీనతలు, అత్యాశను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్తకొత్త పద్ధతుల్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారని, ముఖ్యంగా మల్టీ లెవల్ మార్కెటింగ్ (MLM), గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపే మోసపూరిత స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా. వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, తమ కింద ఎక్కువ మంది ఏజెంట్లను చేర్పిస్తే భారీ కమీషన్లు, రివార్డులు, పాయింట్లు అందిస్తామని కొందరు మోసగాళ్లు ప్రజలను ఆకర్షిస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఇలాంటి గొలుసుకట్టు వ్యాపారాల ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించి, చివరకు పెట్టుబడి పెట్టిన వారిని ఆర్థికంగా నష్టపరుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకొని మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తూ అమాయక ప్రజలను తమ వలలోకి లాగుతున్నారని తెలిపారు. విదేశాల్లో ఉంటూ కొందరు ముఠాలుగా ఏర్పడి ఈ తరహా కార్యకలాపాలను నిర్వహిస్తూ, భారీ లాభాలు, లగ్జరీ కార్లు, విదేశీ పర్యటనలు వంటి ఆశలు చూపించి ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెడుతున్నారని హెచ్చరించారు.
గొలుసుకట్టు వ్యాపారాల్లో ముందుగా చేరిన కొంతమందికి లాభాలు వచ్చినట్లు చూపించి, ఆ తర్వాత చేరేవారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారని, చివరికి అధిక సంఖ్యలో ప్రజలు పెట్టుబడులు కోల్పోవాల్సి వస్తుందని ఎస్పీ వివరించారు. కాబట్టి ఇలాంటి నెట్‌వర్క్ మార్కెటింగ్ స్కీముల్లో ఎవరూ చేరవద్దని, ఆయా సంస్థల నిర్వాహకులు నిర్వహించే ఆకర్షణీయమైన సభలు, సమావేశాలకు వెళ్లి వారి మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు.
ప్రజలు అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దని, అనుమానాస్పద పెట్టుబడి పథకాలు, ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, తద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు




