Nagarkurnool: పదర గ్రామంలో కోతుల బెడద తీవ్రం.. ఆందోళనలో ప్రజలు, రైతులు!
Nagarkurnool: పదర గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి చొరబడి నష్టం కలిగిస్తుండటంతో పాటు, రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి.
Nagarkurnool: పదర గ్రామంలో కోతుల బెడద తీవ్రం.. ఆందోళనలో ప్రజలు, రైతులు!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని ఎనిమిది మండల కేంద్రలలోని గ్రామాలలో కోతుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు కోతుల గుంపులు గ్రామంలో స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
ఉదయం నుండి సాయంత్రం వరకు ఇళ్లపై, గోడలపై గుంపులుగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలను చిందరవందర చేస్తున్నాయి. వంట గదుల్లోకి దూరి పాత్రలను పడేసి నష్టం కలిగిస్తున్నాయి. దీంతో మహిళలు ఇంటి తలుపులు వేసుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. మండలంలో ఎక్కువగా పండ్ల తోటలు, కూరగాయల సాగు చేస్తున్నారు. కోతులు తోటలపై దాడి చేసి కాయలను తెంపి పడేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. చెట్ల కొమ్మలను విరగగొడుతూ మొక్కలకు నష్టం చేస్తున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు కోతుల బెడదతో నష్టాల పాలవుతున్నారు.
వృద్ధులు, పిల్లల్లో భయం:
కోతుల భయంతో చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుండి బయటకు రావడానికి జంకుతున్నారు. స్కూల్ కు వెళ్లే పిల్లలపై దాడి చేస్తుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారులపై కూడా ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి.
అధికారులు స్పందించాలని డిమాండ్:
ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి కోతులను పట్టుకుని వేరే ప్రాంతానికి తరలించాలని, లేదా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
కోతుల బెడద నుండి తమకు రక్షణ కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.




