Pebbair: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - ఎస్‌ఐ
Pebbair: పెబ్బేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ జాగృత దివస్ నిర్వహించారు. ఆన్‌లైన్ మోసాలు, ఓటీపీలు పంచుకోవద్దని ప్రజలకు ఎస్‌ఐ సూచించారు.
Pebbair: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి - ఎస్‌ఐ
పెబ్బేర్: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెబ్బేర్ ఎస్‌ఐ గారు సూచించారు. బుధవారం సైబర్ జాగృత దివస్ సందర్భంగా పెబ్బేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ గారు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, పెట్టుబడి మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
డిజిటల్ చెల్లింపుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, UPI PIN, ATM PIN, CVV, పాస్‌వర్డ్ వంటి రహస్య వివరాలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. బ్యాంకు అధికారులు, పోలీసుల పేరుతో ఫోన్ చేసి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు అడిగినా వాటిని వెల్లడించవద్దని సూచించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయడం, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయడం చేయవద్దని హెచ్చరించారు.
ఆన్‌లైన్ షాపింగ్ మోసాలపై మాట్లాడుతూ తక్కువ ధరలకు వస్తువులు అందిస్తామని చెప్పే నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, రీఫండ్ లింకులు, ఫేక్ ఆఫర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పెట్టుబడి మోసాలపై మాట్లాడుతూ తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్‌లైన్ పెట్టుబడి పథకాలను నమ్మవద్దని అన్నారు. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే అనుమానాస్పద పెట్టుబడి ఆఫర్లను పరిశీలించకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, వెబ్‌సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్‌ఐ సూచించారు. మోసం జరిగిన వెంటనే స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాగే గణేష్ మండపాల నిర్వాహకులు సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను మండపాల వద్ద ప్రదర్శించాలని సూచించారు. డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు, పెట్టుబడి మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సైబర్ నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎస్‌ఐ కోరారు.




