Wanaparthy: పెబ్బేరు రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర ఉద్రిక్తత

Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో వనపర్తి రోడ్డు విస్తరణ పనుల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

G. BALAVARDHAN, PEBBERU
Published on: 19 May 2026 6:56 PM IST
Wanaparthy
X

Wanaparthy: పెబ్బేరు రోడ్డు విస్తరణ పనుల్లో తీవ్ర ఉద్రిక్తత

Wanaparthy: పెబ్బేరు పట్టణంలో వనపర్తి రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా మంగళవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డుకు అడ్డంగా ఉన్న ఇండ్లను తొలగించాలంటూ గతంలో మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన గడువు ముగియడంతో, మున్సిపల్ కమిషనర్ మరియు స్థానిక ఎస్సై ఆధ్వర్యంలో జేసీబీల సహాయంతో తొలగింపు పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇంటి యజమానులు అధికారులను అడ్డుకుని తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఎస్సై జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఇంటి యజమానులకు మరో రోజు గడువు ఇస్తున్నామని, రేపటి లోపు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోకపోతే తప్పనిసరిగా కూల్చివేత చర్యలు చేపడతామని హెచ్చరించారు.

మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, కేవలం రెండు నుంచి మూడు ఇండ్ల కారణంగా వనపర్తి రోడ్డు విస్తరణ పనులు సంవత్సరాలుగా నిలిచిపోయాయని తెలిపారు. ఈ ఇండ్ల తొలగింపుతో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే ఇంటి యజమానులు మాత్రం అధికారుల చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పై నుంచి అందరికీ సమానంగా 40 అడుగుల స్థలం విడవకుండా ఇష్టానుసారంగా మార్కింగ్ చేశారని ఆరోపించారు. తమ ఇంటి వద్ద మాత్రమే 40 అడుగులు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, పిల్లర్ దెబ్బతింటే మొత్తం భవనం కూలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక పట్టణ ప్రజలు మాత్రం అభివృద్ధి పనులకు సహకరించాలని ఇంటి యజమానులను కోరుతున్నారు. ఇప్పటికే అధికారులు పలుమార్లు గడువు ఇచ్చినా సహకరించకపోవడం సరైంది కాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో పెబ్బేరు పట్టణంలో వనపర్తి రోడ్డు విస్తరణ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

G. BALAVARDHAN, PEBBERU

G. BALAVARDHAN, PEBBERU

Next Story