Nagarkurnool: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం అమ్మాలి: అదనపు కలెక్టర్
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధరలకే బియ్యం విక్రయించాలని, నిబంధనలు మీరితే చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ చేన్నయ్య హెచ్చరించారు.
Nagarkurnool: ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం అమ్మాలి: అదనపు కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లాలో బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ ధరలకే బియ్యాన్ని విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ బి. చేన్నయ్య జిల్లాలోని వ్యాపారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నిర్ణీత ధరల కంటే అధికంగా బియ్యం విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో అదనపు కలెక్టర్ బి చేన్నయ్య వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్, రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘాల ప్రతినిధుల మధ్య నిర్వహించిన సమావేశంలో వివిధ రకాల బియ్యం విక్రయాలకు సంబంధించి గరిష్ఠ ధరలను ఖరారు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం తెలంగాణ బీపీటీ బియ్యం కిలో రూ.66, సోనా బియ్యం కిలో రూ.74, శ్రీరామ్ గోల్డ్ బియ్యం కిలో రూ.79కు మించి విక్రయించరాదని అయన స్పష్టం చేశారు.
రైస్ మిల్లర్లు, ట్రేడర్లు, హోల్‌సేల్ డిపో నిర్వాహకులు, చిల్లర వ్యాపారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తే సంబంధిత వ్యాపారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన బియ్యం న్యాయమైన ధరలకు అందుబాటులో ఉండేలా వ్యాపారులందరూ జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి సహకరించాలని అదనపు కలెక్టర్ బి. చేన్నయ్య కోరారు.




