Kollapur: కొండూరులో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ.. బాలల హక్కులపై తీర్మానాలు!

Kollapur: కొల్లాపూర్ నియోజకవర్గం కొండూరు గ్రామంలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ కేతూరి ధర్మతేజ అధ్యక్షతన బాలల సంక్షేమంపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.

VENKATESWARA CHARY, KOLLAPUR
Published on: 15 Nov 2026 9:00 AM IST
Kollapur
X

Kollapur: కొండూరులో ఘనంగా బాలల ప్రత్యేక గ్రామసభ.. బాలల హక్కులపై తీర్మానాలు!

Kollapur: నియోజక వర్గంలోని పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామంలో జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలల సంక్షేమం, హక్కులు, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు కొండూరు గ్రామంలో సర్పంచ్ కేతూరి ధర్మతేజ అధ్యక్షతన విద్యార్థుల సమక్షంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో బాల్యవివాహాల నిర్మూలన, పోషకాహార లోప నివారణ, బాలల ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పలు తీర్మానాలు చేశారు, బాలల సంక్షేమం పట్ల గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇందుకు గ్రామపంచాయతీ పూర్తి సహకారం అందిస్తుందని సర్పంచ్ తెలిపారు.

గ్రామంలోని అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది బాలల ఆరోగ్యం, పోషణ, సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను సభలో వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ హక్కులు,సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకువచ్చారు.

విద్యార్థులు పాఠశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటంతో పాటు బాలలపై వేధింపులు, హింస జరగకుండా, మత్తు పదార్థాల ప్రభావానికి గురికాకుండా గ్రామస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ ధర్మతేజ స్పష్టం చేశారు.

అలాగే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తామని హామీ ఇచ్చారు, బాలల భవిష్యత్తు బాగుంటేనే గ్రామ భవిష్యత్తు బాగుంటుందని, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా, సురక్షితంగా, విద్యావంతంగా ఎదిగేలా గ్రామమంతా బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్లబోతుల గోపాల్, ఉపసర్పంచ్ వడ్డెమాన్ రాముడు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

VENKATESWARA CHARY, KOLLAPUR

VENKATESWARA CHARY, KOLLAPUR