Atmakur: ఎల్‌నినోపై అప్రమత్తత అవసరం: మంత్రి వాకిటి శ్రీహరి
Atmakur: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే 8 నెలలు అత్యంత కీలకమని, తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.
Atmakur: ఎల్‌నినోపై అప్రమత్తత అవసరం: మంత్రి వాకిటి శ్రీహరి
ఆత్మకూరు: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర క్రీడా, పాడి పరిశ్రమాభివృద్ధి, పశు సంవర్ధక, మత్స్య, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... రాబోయే ఎనిమిది నెలలు అత్యంత కీలకమని, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో చెరువులు ఎండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, నీటిని ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించాలని కోరారు. ప్రైవేటు వ్యక్తుల బోర్లలో తాగునీరు అందుబాటులో ఉన్నా, ప్రభుత్వం తరఫున నీటిని కొనుగోలు చేసి ప్రజలకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అధికారులు రైతులకు పంటల ఎంపిక, సాగు ప్రణాళిక, నీటి వినియోగంపై తగిన అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం వల్ల ఎదురయ్యే పరిస్థితులపై ప్రజలకు స్పష్టంగా వివరించి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, క్లిష్ట పరిస్థితుల్లోనూ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.
రైతులకు, గృహ అవసరాలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం మనుషులపైనే కాకుండా పశుపక్షాదులపైనా పడే అవకాశం ఉన్నందున వాటి సంరక్షణకు కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవడంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. నీటి సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకుని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా పనిచేస్తే రాబోయే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవచ్చని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్ డి ఓ సుబ్రహ్మణ్యం,ఎంఆర్ఓ, ఎండిఓ, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




