Achampet: బీజేపీని విమర్శించడం కాదు.. అచ్చంపేట హామీలు నెరవేర్చండి: జానకి!

Achampet: బీజేపీని విమర్శించడం మానేసి అచ్చంపేట ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బల్మూరి జానకి సవాల్ విసిరారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 27 Nov 2026 6:18 PM IST
Achampet
X

Achampet: బీజేపీని విమర్శించడం కాదు.. అచ్చంపేట హామీలు నెరవేర్చండి: జానకి!

Achampet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అచ్చంపేట సభలో బీజేపీ ఎక్కడ ఉంది? అంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర నాయకురాలు బల్మూరి జానకి గారు తీవ్రంగా ఖండించారు.

ముఖ్యమంత్రి గారూ... బీజేపీ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే గత ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకోండి అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న మీరు బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. మీరు గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని 2024లో బీజేపీ గెలుచుకుంది. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ ప్రాంతంతో పాటు మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానంలోనూ బీజేపీ విజయం సాధించింది. ఇదేనా తెలంగాణలో బీజేపీ ఉనికి లేదంటే? అని ప్రశ్నించారు.

బీజేపీ ఎక్కడ ఉందో కామారెడ్డి ప్రజలు చూపించారు. మల్కాజిగిరి ప్రజలు చూపించారు. మహబూబ్‌నగర్ ప్రజలు చూపించారు. ఎన్నికల ఫలితాలే బీజేపీ బలానికి నిదర్శనం అన్నారు.

ముఖ్యమంత్రి గారూ... బీజేపీ గురించి మాట్లాడే ముందు అచ్చంపేటకు మీరేం చేశారో చెప్పండి అని నిలదీశారు. నిన్న అచ్చంపేటలో భారీ సభ నిర్వహించారు. వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని గొప్పగా ప్రకటించారు. కానీ అచ్చంపేట ప్రజలకు ఈ సభతో ఒరిగిందేమిటి? ప్రజలకు కావాల్సింది ప్రసంగాలు కాదు... అభివృద్ధి, హామీల అమలు అన్నారు.

మహిళలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం ఎప్పుడు ఇస్తారు? రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగతా హామీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

రైతులకు సాగునీరు ఎప్పుడు? ఉమామహేశ్వర రిజర్వాయర్ ఎప్పుడు పూర్తవుతుంది? అచ్చంపేట, అమ్రాబాద్, బల్మూరు, ఉప్పునుంతల ప్రాంతాల రైతులకు సాగునీరు ఎప్పుడు అందుతుందని నిలదీశారు.

రూ.450 కోట్ల అభివృద్ధి పనులపై స్పష్టత ఏది? ఏ పనికి ఎంత నిధులు? ఎప్పుడు టెండర్లు? ఎప్పుడు పనులు ప్రారంభం? ఎప్పుడు పూర్తి? కేవలం శంకుస్థాపనలతో అభివృద్ధి జరిగినట్లు కాదని, ప్రజలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఉప్పునుంతల రోడ్డు పరిస్థితి ఎప్పుడు మారుతుంది? అచ్చంపేట నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి వెళ్లే రహదారి పరిస్థితి కూడా సరిగా లేదని, గుంతలమయమైన రోడ్లపై ప్రజలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అచ్చంపేట యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? నిరుద్యోగ భృతి హామీ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

నల్లమల అభివృద్ధి ఏమైంది? శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, ఉమామహేశ్వర రిజర్వాయర్, నల్లమల పర్యాటక అభివృద్ధి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల వంటి ప్రజల చిరకాల డిమాండ్లపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటని నిలదీశారు.

ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ? రైతులకు, మహిళలకు, నిరుద్యోగులకు, పేదలకు ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి అచ్చంపేట పర్యటన సందర్భంగా ప్రజా సమస్యలపై ప్రశ్నించడానికి సిద్ధమైన బీజేపీ, బీజేవైఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ప్రజల సమస్యలను ప్రశ్నించడం తప్పా? ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కితే ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయా? అని ప్రశ్నించారు.

బీజేపీని విమర్శించడం మానేసి అచ్చంపేట ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రజల తరఫున మేము అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉందన్నారు. బీజేపీ ప్రజల పక్షాన నిలబడుతుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తుంది. ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA