Gadwal: బీసీ మహిళలకు 100% సబ్సిడీపై కుట్టు మిషన్లు: కలెక్టర్!

Gadwal: తెలంగాణలో అర్హులైన బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ పథకం ప్రారంభమైంది.

GOKARANNA,  GADWAL
Published on: 20 Aug 2026 11:17 PM IST
Gadwal
X

Gadwal: బీసీ మహిళలకు 100% సబ్సిడీపై కుట్టు మిషన్లు: కలెక్టర్!

గద్వాల్: రాష్ట్రంలోని బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 100% సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందించే కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు.

బీసీ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 1,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను, ఒక్కో యూనిట్‌కు రూ.12,000 చొప్పున 100% సబ్సిడీపై అర్హులైన బీసీ మహిళలకు అందజేయనున్నారు. దరఖాస్తుదారులు బీసీ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళ అయి ఉండాలి. నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలు మరియు మేరా/మేరు (మేర /మేరు) కమ్యూనిటీకి చెందిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షలకు మించకూడదు. తెల్ల రేషన్ కార్డు/ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. కుట్టు వృత్తిలో నైపుణ్యం కలిగిన వారికి, కనీస ప్రాథమిక అక్షరాస్యత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీలోగా https://tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం మండలాల వారీగా ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్ కన్వీనర్లుగా మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను జిల్లా స్థాయి కమిటీకి పంపుతారు.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఇప్పటికే లబ్ధి పొందిన వారు అనర్హులు. డూప్లికేషన్ లేకుండా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) సహాయంతో పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.జిల్లా స్థాయి కమిటీ ఆమోదం అనంతరం, ప్రభుత్వ నిబంధనలు మరియు ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్హులైన మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అందజేస్తారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story