Vikarabad: పోలీసుల 'ప్రగతి ప్రణాళిక'.. సైబర్ నేరాలపై అవగాహన
Vikarabad: వికారాబాద్ జిల్లాలో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" వేగంగా కొనసాగుతోంది.
Vikarabad: పోలీసుల 'ప్రగతి ప్రణాళిక'.. సైబర్ నేరాలపై అవగాహన
Vikarabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక"లో భాగంగా, జిల్లా వ్యాప్తంగా "బాలల భద్రత, రక్షణ మరియు డ్రగ్స్ రహిత సమాజం" లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS ఆదేశాల మేరకు, జిల్లాలోని పోలీసు అధికారులందరూ క్షేత్రస్థాయిలో ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఈ క్రమంలో భాగంగా నేడు "సైబర్ నేరాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు" అనే అంశంపై ప్రత్యేక సదస్సులు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో ముఖ్యంగా లోన్ యాప్‌ల వేధింపులు, ఓటిపి (OTP) షేరింగ్ మోసాలు, నకిలీ పెట్టుబడి పథకాలు, మరియు సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు కొత్త దారుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండటమే మొదటి రక్షణ అని అధికారులు వివరించారు.
ఒకవేళ పొరపాటున సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్ (తొలి గంట)లోనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.
జిల్లా కేంద్రమైన వికారాబాద్‌లోని కొంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీఎస్పీలు జనయ్య గ శ్రీనివాస్ మరియు డీడబ్ల్యూఓ కృష్ణవేణి ఆధ్వర్యంలో బాలల రక్షణ, సైబర్ నేరాలపై సదస్సు నిర్వహించారు. కొడంగల్ సీఐ ఆధ్వర్యంలో వీబీఆర్ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో ట్రాఫిక్ నిబంధనలు, డ్రగ్స్ దుర్వినియోగంపై క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
తాండూర్ టౌన్ ఇన్‌స్పెక్టర్ నర్సింగ్ కాలేజీ హాస్టల్‌లో సైబర్ మోసాలపై అవగాహన కల్పించగా, తాండూర్ షీ టీమ్స్ ప్రభుత్వ కార్యాలయాల్లో లింగ వివక్ష, మహిళా భద్రతపై అవగాహన కల్పించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ కార్యక్రమాలు ముమ్మరంగా సాగాయి. కులకచర్ల ఎస్ఐ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఆటబొమ్మలు పంపిణీ చేసి, 1098, 181 నంబర్ల ప్రాధాన్యతను వివరించారు.
నవాబ్‌పేట ఎస్ఐ ఆధ్వర్యంలో బాలల భద్రతపై భారీ ర్యాలీ నిర్వహించగా, దూద్యాల్ ఎస్ఐ స్థానిక క్రికెట్ జట్లు మరియు సెన్సస్ టీంతో కలిసి డ్రగ్స్ అనర్థాలపై చర్చించారు. దోమ, యాలాల ఎస్ఐలు కెజిబివి పాఠశాలల్లో బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా మరియు రోడ్డు భద్రతపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
మరోవైపు మర్పల్లి, ధారూర్, పెద్దేముల్, కోటపల్లి, మోమిన్‌పేట, దౌల్తాబాద్, చంగోముల్ మరియు బొంరాస్‌పేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆయా ఎస్ఐలు ఉపాధి హామీ కూలీలు, యువత మరియు మహిళలతో సమావేశమై సైబర్ నేరాలు, డ్రగ్స్ రహిత సమాజం మరియు మహిళా భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు.
అలాగే భరోసా సెంటర్ సిబ్బంది పరిగి పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 'పోష్' (POSH) చట్టం మరియు మహిళల రక్షణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్య పరిచారు.




