Wanaparthy: బీచుపల్లి వద్ద గణేష్ నిమజ్జనానికి కృష్ణా నీటి కరువు!
Wanaparthy: బీచుపల్లి కృష్ణా నదిలో నీటి కొరతతో గణేష్ నిమజ్జనానికి ఇబ్బందులు. స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసుకోవాలని వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి విజ్ఞప్తి.
Wanaparthy: బీచుపల్లి వద్ద గణేష్ నిమజ్జనానికి కృష్ణా నీటి కరువు!
వనపర్తి: గణపతి నిమజ్జనానికి ప్రసిద్ధి చెందిన బీచుపల్లి కృష్ణానది వద్ద ఈసారి నీటి లభ్యత తక్కువగా ఉండటంతో నిమజ్జన ఏర్పాట్లపై సందిగ్ధత నెలకొంది. వర్షాలు లేకపోవడంతో జూరాల ప్రాజెక్టు గేట్లు మూసివేయగా, కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గి రాళ్లు, రప్పలు బయటకు కనిపిస్తున్నాయి. బీచుపల్లి వద్ద కొద్దిపాటి నీరు మాత్రమే ప్రవహిస్తోంది.
ప్రతి ఏటా వినాయక నిమజ్జనానికి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అయితే ఈసారి నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో నిమజ్జనానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
నిమజ్జనానికి వచ్చే వారి కోసం రెండు క్రేన్లు, జేసీబీలతో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే నీటి ప్రవాహం సరిపడా లేనందున సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, కాలువల్లో నిమజ్జనం చేసుకోవాలని సూచించారు.
రంగాపూర్ పుష్కర ఘాట్ వద్ద నిమజ్జన ఏర్పాట్లపై వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. జూరాల నుంచి నీరు విడుదలైతేనే కృష్ణానదిలో నిమజ్జనానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. నిమజ్జనానికి వచ్చే వారికి అందుబాటులో ఉన్న నీటి ప్రదేశాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ప్రజలు సాధ్యమైనంత వరకు తమ సమీపంలోని నీటి వనరుల్లోనే నిమజ్జనం చేసుకోవాలని సూచించారు.
ఈ విషయాన్ని వినాయక మండపాల నిర్వాహకులకు, ఎస్.ఐల ద్వారా ముందుగానే తెలియజేయాలని సూచించినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, సీఐ ఓడీ రమేష్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




