Devarakadra: కోయిల్ సాగర్ నుంచి లగచర్లకు నీటి తరలింపును అడ్డుకుంటాం!
Devarakadra: కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి లగచర్లకు రూ.490 కోట్ల నీటి తరలింపు ప్రతిపాదనను అడ్డుకుంటామని శుక్రవారం బీజేపీ నేత కొండా ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
Devarakadra: కోయిల్ సాగర్ నుంచి లగచర్లకు నీటి తరలింపును అడ్డుకుంటాం!
దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి కొడంగల్ నియోజకవర్గానికి నీటిని తరలించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు దేవరకద్ర మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.490 కోట్ల వ్యయంతో రోజుకు నాలుగు కోట్ల లీటర్ల నీటిని మద్దూర్, కోస్గి పట్టణాలతో పాటు పారిశ్రామిక అవసరాల కోసం లగచర్లకు తరలించేందుకు ప్రతిపాదనలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే కోయిల్ సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు సరైన సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని,రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి తరలింపు తో దేవరకద్ర నియోజకవర్గంలో పాటు ధన్వాడ మరికల్ మండలాలు ఎడారిగా మారుతాయని అన్నారు.
స్థానిక రైతుల సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా ఇతర ప్రాంతాలకు నీటిని తరలించే ఆలోచన చేయడం సరికాదన్నారు.కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అదేవిధంగా బ్రహ్మోస్ యూనిట్ లో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు 30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండలాధ్యక్షుడు కృష్ణంరాజు, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యజ్ఞభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నారాయణరెడ్డి, ఓబిసి కార్యవర్గ సభ్యులు దేవన్నసాగర్, బిజెపి కౌన్సిలర్ ఉమారాజు, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




