Achampet: సీఎం రాకతోనైనా వసతి గృహాల దశ మారేనా?: డా. నరేష్ యాదవ్ డిమాండ్!

Achampet: కొండనాగుల బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థలో ఉందని, సీఎం రాకతోనైనా వాటి దశ మారాలని టీఆర్పీ అచ్చంపేట ఇంచార్జ్ నరేష్ యాదవ్ బుధవారం డిమాండ్ చేశారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 25 Nov 2026 10:47 PM IST
Achampet
X

Achampet: సీఎం రాకతోనైనా వసతి గృహాల దశ మారేనా?: డా. నరేష్ యాదవ్ డిమాండ్!

అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలో బీసీ బాలుర వసతి గృహం శిథిలావస్థలో కూలిపోయే ప్రమాదపు అంచులో ఉంది.

ప్రభుత్వం ప్రజా పాలన, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నా... కనీసం వసతి గృహాలు లేనటువంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ వసతి గృహం చూసినా ఇదే పరిస్థితి ఉందని, సొంత భవనాలు లేక అద్దె భవనాలలో పిల్లలను ఉంచుతున్నారని చెబుతున్నారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం కేటాయిస్తున్న నిధులన్నీ ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నిస్తున్నారు. వెనుకబడిన వర్గాల విద్యార్థుల బతుకులు మారాలంటే వారి సంక్షేమానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎడ్యుకేషన్ హబ్ గా అచ్చంపేటను మారుస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు... ఈ ప్రాంతంలో ఉన్న పాఠశాలలు, కళాశాలలు వేరే ప్రాంతాలకు తరలిపోతుంటే చూస్తూ ఉన్నారని విమర్శించారు. వాటికి సొంత భవనాలు నిర్మించి ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు.

రేపు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో... అచ్చంపేట నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక టీపీఎస్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డా. నారమోని నరేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివాసీ గిరిజనుల కోసం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో చెప్పారని, అదే యూనివర్సిటీని అచ్చంపేట నియోజకవర్గంలో గిరిజనులు, ఆదివాసులు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు.

బల్మూరు మండలంలో జినుకుంట దగ్గర ఉన్న లెదర్ పార్కును అభివృద్ధి చేయాలని, అచ్చంపేట పట్టణంలో డిగ్రీ, పీజీ కళాశాలను ఏర్పాటు చేయాలని, శిథిలావస్థలో ఉన్న జూనియర్ కళాశాల భవనాన్ని పునర్ నిర్మించాలని, ఉప్పునుంతల మండలం రాయిచేడిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బల్మూరు మండల అధ్యక్షుడు అమరేందర్ గౌడ్, అచ్చంపేట టౌన్ ప్రెసిడెంట్ నిరంజన్, అచ్చంపేట టౌన్ జనరల్ సెక్రెటరీ రమేష్, వైస్ ప్రెసిడెంట్ మహేష్, సెక్రటరీ మల్లేష్, సిద్దు, నాని, దేవేందర్, రమేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA