Mancherial: మంచిర్యాలలో అగ్రిగోల్డ్ బాధితుల వెరిఫికేషన్ సెంటర్!
Mancherial: మంచిర్యాలలో వెరిఫికేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామికి అగ్రిగోల్డ్ బాధితుల వినతి. సీఐడీతో మాట్లాడతానని మంత్రి హామీ!
Mancherial: మంచిర్యాలలో అగ్రిగోల్డ్ బాధితుల వెరిఫికేషన్ సెంటర్!
Mancherial: మంచిర్యాల జిల్లా అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఆదివారం మంచిర్యాలలోని మంత్రి నివాసంలో ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు.
అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణలో మూడు కేంద్రాల్లో సీఐడీ ఆధ్వర్యంలో బాండ్ల వెరిఫికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 80 వేల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నందున, వారి సౌకర్యార్థం మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ బాండ్ల వెరిఫికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు.
బాధితుల విజ్ఞప్తిపై మంత్రి వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విషయంపై సీఐడీ అధికారులతో మాట్లాడి మంచిర్యాల జిల్లాలో వెరిఫికేషన్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన మంత్రికి అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావుతో పాటు సంఘం సభ్యులు దామరశెట్టి రమేష్, రామడుగు లక్ష్మణ్, ఇరుకుళ్ల సుధాకర్, ప్రవీణ్ కుమార్, సమ్మయ్య, రాజు, పుణ్య, మహేష్, సురేష్ కుమార్, అహ్మద్, ముజాహిదీన్ తదితరులు పాల్గొన్నారు.




