Bheemini: భీమిని జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యం అక్రమ తరలింపు కలకలం!
Bheemini: మంచిర్యాల జిల్లా భీమిని జెడ్పీ పాఠశాల నుండి ట్రాక్టర్‌లో మధ్యాహ్న భోజన బియ్యం అక్రమంగా తరలింపు.
Bheemini: భీమిని జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజన బియ్యం అక్రమ తరలింపు కలకలం!
Bheemini: విద్యార్థులకు అందించాల్సిన మధ్యాహ్న భోజన పథకం బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు భీమిని మండల కేంద్రంలో కలకలం రేపుతున్నాయి. శుక్రవారం భీమిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ట్రాక్టర్‌లో బియ్యాన్ని తరలిస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో పాఠశాల నిర్వహణ తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పాఠశాలలో సుమారు 260 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటుండగా, వారికి ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంది.
అయితే విద్యార్థుల అవసరాలకు వినియోగించాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ సుమారు 30 నుంచి 60 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరు కారు.. హాజరైన విద్యార్థుల్లో కొందరు విద్యార్థులు ఇంటి వద్దనుండే భోజనాన్ని తీసుకొని వస్తారు.. మిగిలే ఆహార ధాన్యాల లెక్కలు, నిల్వల వివరాలు సక్రమంగా నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రతి నెలా ఇదే తరహాలో క్వింటాళ్ల కొద్దీ బియ్యం పాఠశాల నుంచి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంలో ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బియ్యం తరలింపునకు సంబంధించి నెలకు రూ.4 వేల వరకు తీసుకుంటున్నారనే ప్రచారం సైతం స్థానికంగా వినిపిస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారిక విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.
ఎంఈఓ పాఠశాలలోనే అక్రమాలా?
ఈ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయుడే మండల విద్యాధికారిగా (ఎంఈఓ) అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం.
విద్యార్థులకు అందాల్సిన ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారికి సంబంధించిన పాఠశాలలోనే ఇలాంటి ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. విద్యాశాఖలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే అధికారే తన పాఠశాల నిర్వహణపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తన పరిధిలోని పాఠశాలల్లో పారదర్శకతను, క్రమశిక్షణను కాపాడాల్సిన ఎంఈఓ బాధ్యతలపై ఇప్పుడు ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాల్సిన అధికారుల పాఠశాలలోనే ఇలాంటి అక్రమాల ఆరోపణలు వస్తే మండలంలోని ఇతర పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు పరిస్థితి ఎలా ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పేద విద్యార్థులకు అందాల్సిన ఆహార ధాన్యాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు నిజమైతే అది కేవలం నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు.. విద్యార్థుల హక్కులకు భంగం కలిగించే తీవ్రమైన వ్యవహారం.
జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల బియ్యం నిల్వలు, పంపిణీ రికార్డులు, ట్రాక్టర్‌లో తరలించిన బియ్యం వివరాలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఆరోపణలు నిజమని తేలితే ప్రధానోపాధ్యాయుడు, సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




