Singareni: సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం!

Singareni: గైర్హాజరుతో తొలగించబడిన మాజీ ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించేందుకు సింగరేణి ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులు నవంబర్ 14లోగా దరఖాస్తు చేయాలి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 3 Nov 2026 8:30 PM IST
Singareni
X

Singareni: సింగరేణి డిస్మిస్డ్ ఉద్యోగులకు మరో అవకాశం!

మంచిర్యాల: సింగరేణి సంస్థలో గైర్హాజరు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన మాజీ కార్మికులకు యాజమాన్యం తీపికబురు అందించింది. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో విధులకు దూరమై ఉద్యోగాల నుంచి డిస్మిస్ అయిన వారికి తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మరో అవకాశం కల్పించింది. 2023 నుంచి 2025 మధ్య కాలంలో గైర్హాజరు కారణంగా తొలగించబడిన ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకోసం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోల్‌బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో డిస్మిస్ అయిన ఉద్యోగులకు తిరిగి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పలువురు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి ఈ అంశాన్ని పరిశీలించాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం తాజా నిర్ణయం తీసుకుంది.

ఇవీ అర్హతలు..

2023 జనవరి 1 నుంచి 2025 డిసెంబర్ 31 మధ్య గైర్హాజరు కారణంగా ఉద్యోగం నుంచి తొలగించబడిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2026 ఏప్రిల్ 1 నాటికి 46 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉండాలి. ఉద్యోగం నుంచి తొలగించబడటానికి ముందు ఐదు క్యాలెండర్ సంవత్సరాల్లో ఏవైనా రెండేళ్లలో కనీసం 100 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. జనరల్ అసిస్టెంట్ ట్రైనీ (UG), కేటగిరీ-1 పోస్టులో తిరిగి నియామకానికి వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి.

ఈ నెల 14 చివరి గడువు..

అర్హత కలిగిన మాజీ ఉద్యోగులు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తులను పూర్తి చేసి తాము చివరిగా పనిచేసిన గని లేదా డిపార్ట్‌మెంట్ అధిపతికి సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 14, 2026 చివరి తేదీగా యాజమాన్యం నిర్ణయించింది. ఏరియా జనరల్ మేనేజర్లు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు పంపించనున్నారు.

ఉద్యోగాలు కోల్పోయి తిరిగి విధుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న మాజీ కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. అయితే అర్హతలు, వైద్య పరీక్షలు, హైపవర్ కమిటీ పరిశీలన అనంతరమే పునర్నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం సంబంధిత గని లేదా శాఖ అధికారులను సంప్రదించాలని యాజమాన్యం సూచించింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.