Asifabad: బెజ్జూర్ కోడిపందాలు ముగ్గురికి రూ.లక్ష చొప్పున బైండోవర్

Asifabad: బెజ్జూర్ మండలంలో కోడిపందాలు ఆడుతూ పట్టుబడిన ముగ్గురికి తహసీల్దార్ ఎదుట బైండోవర్. మళ్లీ ఆడితే రూ.1 లక్ష జరిమానా విధిస్తామని ఎస్‌ఐ రమేష్ హెచ్చరిక.

SRINIVAS, KOUTALA
Published on: 19 Oct 2026 7:42 PM IST
Asifabad
X

Asifabad: బెజ్జూర్ కోడిపందాలు ముగ్గురికి రూ.లక్ష చొప్పున బైండోవర్

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులుగుపల్లి గ్రామ శివారులోని గంగారంగూడ ప్రాంతంలో కోడిపందాలు ఆడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ మరియు తహసీల్దార్, బెజ్జూర్ వారి ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

బెజ్జూర్ ఎస్‌ఐ రమేష్ పోలీసు సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో కత్తులు కట్టి, డబ్బులు పందెంగా పెట్టి కోడిపందాలు ఆడుతున్న ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.300 నగదు, మూడు కోళ్లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఈ క్రమంలో సదరు వ్యక్తులు మరోసారి కోడిపందాలు ఆడితే ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం ముగ్గురికి కలిపి 3లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చేలా బైండోవర్ చర్యలు చేపట్టారు. బెజ్జూర్ మండల పరిధిలో ఎవరైనా కోడిపందాలు, జూదాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రమేష్ హెచ్చరించారు.

ఇప్పటికే బైండోవర్ చేసినప్పటికీ మళ్లీ కోడిపందాలు ఆడితే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. మండల ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా కోడిపందాలు లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA