Asifabad: బడుల్లో మౌలిక వసతులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

Asifabad: ఆసిఫాబాద్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, యు-డైస్ వివరాల నమోదు, హాజరు పర్యవేక్షణపై కలెక్టర్ కె. హరిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 19 Nov 2026 7:15 PM IST
Asifabad
X

Asifabad: బడుల్లో మౌలిక వసతులపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి

ఆసిఫాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి, నాణ్యమైన విద్య అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. పాఠశాలల్లో కనీస వసతుల కల్పనతో పాటు విద్యార్థుల హాజరు, బోధనా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్‌తో కలిసి విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యు-డైస్ (UDISE) అవగాహన, శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, సర్వశిక్ష ఎంఐఎస్, సీఆర్‌పీలు, సీసీఓలకు పాఠశాలల వివరాల నమోదు, విద్యా నిర్వహణపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థులకు 100 శాతం మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

యు-డైస్ పోర్టల్‌లో పాఠశాల భవనాలు, తరగతి గదులు, విద్యార్థుల ప్రవేశాలు, వయస్సు, తరగతులు, ఆధార్, అపార్ వివరాలతో పాటు ఉపాధ్యాయుల విద్యార్హతలు, సర్వీసు వివరాలు, పోస్టింగ్ తదితర సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, ప్రణాళికల రూపకల్పనకు ఈ వివరాలు కీలకమని పేర్కొన్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం పెంచడంతో పాటు సాధ్యమైనంత వరకు 100 శాతం హాజరు ఉండేలా పర్యవేక్షించాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన అందిస్తూ వారి అభ్యసన సామర్థ్యాలను పెంపొందించాలని సూచించారు. మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించి విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, విద్యార్థుల సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు.

ప్రధానమంత్రి శ్రీ పాఠశాలలు, సర్వశిక్ష అభియాన్ కింద మంజూరైన నిధులను పాఠశాలల్లో కనీస వసతుల కల్పనకు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు, మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.