Asifabad: పెంచికల్‌పేట్‌లో కార్డన్ సెర్చ్.. బెల్లం పానకం ధ్వంసం
Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం ఎల్లకపల్లిలో కార్డన్ సెర్చ్. 850 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, 10 వాహనాలు సీజ్.
Asifabad: పెంచికల్‌పేట్‌లో కార్డన్ సెర్చ్.. బెల్లం పానకం ధ్వంసం
ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ మండలం అక్రమ కార్యకలాపాలను ఉపేక్షించబోమని ఎస్ఐ అనిల్ కుమార్ అన్నారు. మండలంలో ఎల్లకపల్లి గ్రామంలో ఎస్సై అనిల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తయారు చేస్తున్న 850 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, 8 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. అలాగే తనిఖీల్లో సరైన పత్రాలు లేని 10 వాహనాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే కార్డన్ సెర్చ్‌ల ప్రధాన ఉద్దేశమన్నారు. గుడుంబా తయారీ, విక్రయాలు, రవాణా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, బీమా తదితర వాహన పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా అక్రమ కార్యకలాపాల గురించి వెంటనే సమాచారం అందించాలని కోరారు.
ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టగలమని, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్డన్ సెర్చ్‌లు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




