Asifabad: రేచినిలో అనాథ పిల్లలకు నెలకు ₹4,000 ఆర్థిక సాయం

Asifabad: బెజ్జూరు మండలం రేచినిలో అనాథ పిల్లలను పరామర్శించిన DCPO మహేష్. నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ, మిషన్ వాత్సల్య ద్వారా ₹4,000 పెన్షన్ మంజూరు.

SRINIVAS, KOUTALA
Published on: 30 July 2026 3:13 PM IST
Asifabad
X

Asifabad: రేచినిలో అనాథ పిల్లలకు నెలకు ₹4,000 ఆర్థిక సాయం

ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం రేచిని గ్రామానికి చెందిన అనాథ పిల్లల పరిస్థితిని తెలుసుకునేందుకు ఈరోజు జిల్లా బాలల పరిరక్షణ అధికారి (District Child Protection Officer) బూర్ల మహేష్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమార్తో కలిసి గ్రామాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, నివాస పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వారి సంరక్షకులు మరియు అంగన్‌వాడీ టీచర్ శ్రీమతి బాయక్కతో మాట్లాడి పూర్తి వివరాలను సేకరించారు. తక్షణ సహాయ చర్యల్లో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం (DCPU) ఆధ్వర్యంలో కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.

పాఠశాల మానేసిన బాలికను వెంటనే తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే మిగిలిన పిల్లలు నిరంతరాయంగా విద్యను కొనసాగించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

అదేవిధంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు మిషన్ వాత్సల్య స్పాన్సర్‌షిప్ పథకం కింద ఇద్దరు చిన్నారులకు ప్రతి నెల ₹4,000 చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా బాలల పరిరక్షణ అధికారి బూర్ల మహేష్ తెలిపారు.

అవసరమైతే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కూడా పిల్లలకు అర్హత మేరకు అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అనాథ, నిరాశ్రయ, అత్యంత ఆపదలో ఉన్న పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, వారికి విద్య, పోషణ, రక్షణ, ఆరోగ్య సేవలు, పునరావాసం మరియు సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమార్, అంగన్‌వాడీ టీచర్ శ్రీమతి బాయక్క, గ్రామస్థులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story