Asifabad: గంజాయి వినియోగదారులకు పోలీసుల కౌన్సిలింగ్ వ్యసన విముక్తికి సహకారం!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి వ్యసనపరులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్పీ నితికా పంత్. డ్రగ్స్ రహిత జిల్లా నిర్మాణానికి పిలుపు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 6 Nov 2026 2:48 PM IST
Asifabad
X

Asifabad: గంజాయి వినియోగదారులకు పోలీసుల కౌన్సిలింగ్ వ్యసన విముక్తికి సహకారం!

Asifabad: కోమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: గంజాయి వినియోగానికి అలవాటుపడిన వారిలో మార్పు తీసుకువచ్చి, వారిని వ్యసనం నుంచి బయటపడేలా చేసేందుకు ఆసిఫాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ ఫోర్స్ తెలంగాణ సహకారంతో జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో గంజాయి వినియోగదారులు, విక్రయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ వారితో నేరుగా మాట్లాడి గంజాయి వినియోగానికి గల కారణాలు, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు, కుటుంబ సంబంధాలపై పడే ప్రభావం, ఆర్థిక ఇబ్బందుల గురించి అవగాహన కల్పించారు.

గంజాయి వ్యసనానికి అలవాటుపడిన వారిని కేవలం నేరస్థులుగా చూడకుండా, వారిలో మార్పు తీసుకువచ్చి సాధారణ జీవనంలోకి తీసుకురావడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ తెలిపారు. వ్యసనం నుంచి బయటపడాలనుకునే వారికి అవసరమైన సహకారం అందిస్తామని, పరిస్థితిని బట్టి రిహాబిలిటేషన్ కేంద్రాల్లో చేర్పించి వైద్య నిపుణుల పర్యవేక్షణలో వ్యసన విముక్తి పొందేలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.

మరోవైపు కాగజ్‌నగర్, ఈస్గాం మండలాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, చంద్రాపూర్, రాజురా ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరిగే అవకాశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గంజాయి సరఫరా, విక్రయాల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గంజాయి కేసుల్లో నమోదైన వారు గతాన్ని పాఠంగా తీసుకొని భవిష్యత్తును సన్మార్గంలో తీర్చిదిద్దుకోవాలని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలు, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1908 హెల్ప్‌లైన్ లేదా 8712671111 వాట్సాప్ నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

డ్రగ్స్ రహిత జిల్లా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, SAY NO TO DRUGS – SAY YES TO LIFE అనే సందేశాన్ని ప్రజలంతా పాటించాలని ఎస్పీ నితికా పంత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, టౌన్ సీఐ రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.