Asifabad: మూడు రోజుల్లో 6 కేసులు.. సాగుదారులకు ప్రభుత్వ పథకాలు రద్దు: ఎస్పీ!

Asifabad: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 3 రోజుల్లో 500 మొక్కలు స్వాధీనం చేసుకుని, సాగుదారులకు సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ఎస్పీ తెలిపారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 5 Oct 2026 6:35 PM IST
Asifabad
X

Asifabad: మూడు రోజుల్లో 6 కేసులు.. సాగుదారులకు ప్రభుత్వ పథకాలు రద్దు: ఎస్పీ!

కుమురం భీమ్ ఆసిఫాబాద్, అక్టోబర్ 5: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా అక్రమ గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు, దాడులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

ఎస్పీ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ సబ్‌ డివిజన్ డీఎస్పీ బి. అశోక్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా లింగాపూర్, సిర్పూర్ (యు), కెరమెరి పోలీస్ స్టేషన్ పరిధుల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా సాగు చేస్తున్న సుమారు 500 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

గంజాయి సాగుకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఆరు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

2025లో 39 కేసులు

2025 సంవత్సరంలో అక్రమ గంజాయి సాగుకు సంబంధించి 39 కేసులు నమోదు చేసి, 35 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి సుమారు రూ.1.13 కోట్ల విలువైన 1,134 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

అక్రమ గంజాయి సాగులో పాల్గొన్న వారి భూ యజమానుల వివరాలను సేకరించి, కలెక్టర్ ఆదేశాల మేరకు 20 మంది భూ యజమానులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందే ప్రయోజనాలను నిలిపివేసినట్లు తెలిపారు.

2026లో 23 కేసులు.. రూ.2.36 కోట్ల గంజాయి మొక్కలు స్వాధీనం

2026లో ఇప్పటివరకు అక్రమ గంజాయి సాగుకు సంబంధించి 23 కేసులు నమోదు చేసి, 27 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. వారి నుంచి సుమారు రూ.2.36 కోట్ల విలువైన 2,366 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ కేసుల్లో నిందితుల భూ యజమానుల వివరాలను స్థానిక తహసీల్దార్ల ద్వారా సేకరించి జిల్లా కలెక్టర్‌కు నివేదిస్తామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హత ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని నిలిపివేయడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

డ్రై గంజాయి అక్రమ రవాణాపైనా చర్యలు

2026లో ఇప్పటివరకు డ్రై గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి 32 కేసులు నమోదు చేసి, 68 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసుల్లో సుమారు 10 కిలోల డ్రై గంజాయిని, దాని విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని పేర్కొంటూ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాల వల్ల ముఖ్యంగా యువత, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఎస్పీ అన్నారు. గంజాయి సాగుకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు, నిబంధనల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాల నిలిపివేత వంటి చర్యలు కూడా కొనసాగుతాయని హెచ్చరించారు.

జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా గంజాయి సాగు, రవాణా లేదా విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు ఎస్పీ సూచించారు. గంజాయి నిర్మూలన కోసం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ నితికా పంత్ అభినందించారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో నిరంతర తనిఖీలు, ప్రత్యేక దాడులు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.