Mancherial: కేంద్ర విధానాలపై సీఐటీయూ ధ్వజం.. కరపత్రాల విడుదల!

Mancherial: బెల్లంపల్లిలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరగబోయే దేశవ్యాప్త 'జైల్ భరో' కార్యక్రమ కరపత్రాన్ని సీఐటీయూ నేతలు విడుదల చేశారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 2 Aug 2026 5:29 PM IST
Mancherial
X

Mancherial: కేంద్ర విధానాలపై సీఐటీయూ ధ్వజం.. కరపత్రాల విడుదల!

మంచిర్యాల: క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న "జైల్ భరో" కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాతంత్రవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు.

ఆదివారం బెల్లంపల్లి తాపీ సంఘం భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు చల్లూరి దేవదాస్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అబ్బోజు రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, కార్మికులు, రైతులు, ప్రజలకు వ్యతిరేకంగా విధానాలు అమలు చేస్తోందని ఆయన విమర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్ర్యాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆరోపించారు. నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో నేడు కార్పొరేట్ శక్తులు, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 10న నిర్వహించే "జైల్ భరో" కార్యక్రమంలో గ్రామాలు, బస్తీలు, పరిశ్రమల ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బెల్లంపల్లిలో ఆగస్టు 10న ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో సింగరేణి, మున్సిపల్, గ్రామపంచాయతీ, రైల్వే, ఆస్పత్రి, అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆటో యూనియన్లు, వివిధ రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించే "జైల్ భరో" కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గుమాస అశోక్, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాగం రాజారాం, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, తాండూరు మండల నాయకురాలు సత్యవతి, మధ్యాహ్న భోజన కార్మికుల మండల కార్యదర్శి పి. రమాదేవి, ఆశా బెల్లంపల్లి మండల అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, మచ్చ పద్మావతి, మంగావతి, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా వర్కర్లు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, అలాగే బెల్లంపల్లి, నేన్నెల, తాండూరు మండలాలకు చెందిన నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story