Bellampalli: నేత్రదానంతో ఇద్దరికి చూపు.. కుటుంబం ఆదర్శం

Bellampalli: మంచిర్యాల బెల్లంపల్లికి చెందిన తూడి రాజం మరణానంతరం కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి ఇద్దరు అంధులకు చూపునిచ్చే గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 19 Nov 2026 6:22 PM IST
Bellampalli
X

Bellampalli: నేత్రదానంతో ఇద్దరికి చూపు.. కుటుంబం ఆదర్శం

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మనిషి మరణం ఓ కుటుంబానికి తీరని విషాదం.. కానీ అదే మరణం మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపితే అంతకంటే గొప్ప మానవత్వం మరొకటి ఉండదు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఏరియాకు చెందిన తూడి రాజం (70) మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు.

తూడి రాజం గుండెపోటుతో మృతి చెందగా, పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు జనహిత సేవా సమితి కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్ నేత్రదానంపై అవగాహన కల్పించారు. దీంతో తమ కుటుంబ సభ్యుడి కళ్ళ ద్వారా మరో ఇద్దరు చూపు లేని వారికి వెలుగులు అందించాలని భావించిన కుటుంబం నేత్రదానానికి ముందుకొచ్చింది. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నేత్రదాన ప్రక్రియలో భాగంగా కార్నియాలను సేకరించారు.

ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. తూడి రాజం మృతి బాధాకరమని, అయితే ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోనూ నేత్రదానం చేయాలనే గొప్ప నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. భార్య తూడి మల్లక్క, కుమారుడు, కోడలు కుమారస్వామి–పుష్పలత, కుమార్తెలు స్రవంతి, మౌనిక, అల్లుళ్లు రామ, ప్రవీణ్‌తో పాటు కుటుంబ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారని కొనియాడారు.

జనహిత సేవా సమితి ద్వారా ఇది 27వ నేత్రదాన కార్యక్రమమని తెలిపారు. మరణించిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోవడం లేదా బూడిద కావడం కంటే నేత్రాలు, అవయవాలు, శరీరాన్ని దానం చేసి ఇతరులకు ఉపయోగపడేలా చేయాలని పిలుపునిచ్చారు. నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపునిచ్చే అవకాశం ఉందని, మరణించిన ఎనిమిది గంటల్లోపు కార్నియా సేకరణ చేయడం కీలకమని వివరించారు.

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవదానం ద్వారా ఆరుగురికి ప్రాణదానం చేసే అవకాశం ఉందని, శరీరదానం వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనలకు ఉపయోగపడుతుందని తెలిపారు. నేత్ర, అవయవ, శరీరదానంపై ప్రజలు అపోహలు వీడి ముందుకు రావాలని కోరారు.

నేత్రదాన కార్యక్రమానికి సహకరించిన కుటుంబ సభ్యులు, వారి మిత్రుడు కొండ రాజశేఖర్, జనహిత సేవా సమితి కోశాధికారి కొడిపెల్లి గిరిప్రసాద్, ప్రచార కార్యదర్శి, నేత్రదాన కమిటీ బాధ్యులు డోలి సుకుమార్, ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నేత్రదానం అనంతరం కుటుంబ సభ్యులకు ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ తరఫున ధ్రువీకరణ పత్రం అందజేశారు.

మరణించినా.. ఆయన కళ్లతో మరో ఇద్దరు ఈ ప్రపంచాన్ని చూడబోతున్నారు. తూడి రాజం కుటుంబం తీసుకున్న నిర్ణయం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం..

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI