Mancherial: నిషేధిత గడ్డి మందుల కలకలం.. నలుగురు నిందితుల అరెస్ట్!

Mancherial: భీమిని పరిధిలో మహారాష్ట్ర నుండి తరలిస్తున్న రూ.1.44 లక్షల విలువైన నిషేధిత గడ్డి మందులను డీసీపీ ఎ. భాస్కర్ ఆదేశాలతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

PRATHAP, BELLAMPALLI
Published on: 1 Aug 2026 11:57 PM IST
Mancherial
X

Mancherial: నిషేధిత గడ్డి మందుల కలకలం.. నలుగురు నిందితుల అరెస్ట్!

మంచిర్యాల: మహారాష్ట్ర నుంచి నిషేధిత గడ్డి మందుల అక్రమ రవాణాపై మంచిర్యాల జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. భీమిని మండలంలో రైతులకు విక్రయించేందుకు తీసుకొచ్చిన గడ్డి మందులను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీసీపీ ఎ. భాస్కర్ వెల్లడించారు.

మంచిర్యాల జిల్లా భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా గడ్డి మందులను అక్రమంగా తరలించి రైతులకు విక్రయించేందుకు యత్నించిన నలుగురు నిందితులను భీమిని పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుల వద్ద నుంచి సుమారు రూ.1.44 లక్షల విలువైన 290 లీటర్ల గడ్డి మందులు, ఒక టయోటా ఇన్నోవా కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తాండూర్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ మాట్లాడుతూ, విశ్వసనీయ సమాచారం మేరకు భీమిని ఎస్సై కోటేశ్వర్ తన బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.

విచారణలో మహారాష్ట్రలోని రాజూరా ప్రాంతం నుంచి గడ్డి మందులను కొనుగోలు చేసి భీమిని మండల పరిధిలో అక్రమంగా విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు.

గ్లైఫోసేట్ వంటి గడ్డి మందుల వినియోగం వల్ల భూమి సారవంతం తగ్గడంతో పాటు పర్యావరణానికి హాని, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డీసీపీ హెచ్చరించారు.

రైతులు ప్రభుత్వం అనుమతించిన, లైసెన్సు కలిగిన దుకాణాల్లోనే వ్యవసాయ మందులు కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. అక్రమంగా గడ్డి మందులను విక్రయిస్తున్న వారి గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీసీపీ స్పష్టం చేశారు.

PRATHAP, BELLAMPALLI

PRATHAP, BELLAMPALLI

Next Story