Kagaznagar: సర్ సిల్క్ ప్రజలతో రేపు బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ ప్రత్యేక సమావేశం!

Kagaznagar: కాగజ్‌నగర్ సర్ సిల్క్ ప్రాంతవాసులకు ఇళ్ల ఖాళీ నోటీసులపై న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించేందుకు బీఆర్‌ఎస్ లీగల్ టీమ్, నేతలు రేపు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 15 Nov 2026 8:55 AM IST
Kagaznagar
X

Kagaznagar: సర్ సిల్క్ ప్రజలతో రేపు బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ ప్రత్యేక సమావేశం!

Kagaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లోని సర్ సిల్క్ ప్రాంత ప్రజలకు ఇళ్ల ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. గత 60 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న తమకు కేవలం ఏడు రోజుల్లో ఇళ్లు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సర్ సిల్క్ ప్రాంత ప్రజలకు న్యాయపరమైన అండగా నిలిచేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో పాటు బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.

నవంబర్ 15 ఆదివారం ఉదయం 10 గంటలకు సర్ సిల్క్ ప్రాంతంలోని పార్క్ లైన్ మైదానంలో సమావేశం నిర్వహించనున్నారు. నోటీసులు అందుకున్న బాధితులు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ నాయకులు కోరారు. అధికారులు జారీ చేసిన నోటీసులు, నివాసానికి సంబంధించిన ఆధారాలు, ఇంటికి సంబంధించిన ఇతర పత్రాలను వెంట తీసుకురావాలని సూచించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ లీగల్ టీమ్ బాధితులకు న్యాయపరమైన అంశాలను వివరించడంతో పాటు, నోటీసులను చట్టపరంగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పించనుంది. ఇళ్ల ఖాళీ నోటీసులతో ఆందోళన చెందుతున్న ప్రజల సమస్యలను తెలుసుకుని న్యాయపరమైన మార్గదర్శకత్వం అందించడమే సమావేశం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR