Mancherial: భూ సమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి: లోకేష్ కుమార్!
Mancherial: భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) లోకేష్ కుమార్ ఆదేశించారు.
Mancherial: భూ సమస్యల పరిష్కారం వేగవంతం చేయాలి: లోకేష్ కుమార్!
మంచిర్యాల: భూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, భూముల రీ సర్వే ప్రక్రియతో పాటు భూభారతి పథకంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. భూ సంబంధిత సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), కలెక్టరేట్ పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ కేసులు, భూదాన్ భూములు, భూముల రీ సర్వే, హైకోర్టు కేసులు, భూభారతి పథకంలోని పాత, కొత్త పెండింగ్ దరఖాస్తులు, భూసేకరణ, యూఎల్‌సీ భూములు, జీవో నంబర్లు 59, 76, 118 కింద భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పురోగతిపై సమీక్షించారు.
భూదాన్ భూములకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయాలని, రీ సర్వే పనులను వేగవంతం చేయాలని కమిషనర్ సూచించారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న భూ సంబంధిత కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన నివేదికలు, రికార్డులను సిద్ధం చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.
భూభారతి పథకంలో వచ్చిన పాత, కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి, అందుబాటులో ఉన్న భూ రికార్డుల ఆధారంగా నిబంధనల ప్రకారం పరిష్కరించాలని తెలిపారు. యూఎల్‌సీ భూములు, జీవో 59, 76, 118 కింద క్రమబద్ధీకరణకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువులోగా చర్యలు పూర్తి చేయాలని సూచించారు. విజిలెన్స్, ఇంటెలిజెన్స్ విభాగాలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, పరిష్కార పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో భూముల రీ సర్వే పనులు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. భూభారతి పథకంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను క్షేత్రస్థాయి విచారణ అనంతరం నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. జీవో 59, 76, 118 కింద ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్‌పాండే, బి, డి సెక్షన్ల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




