Mancherial: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి కలెక్టర్!

Mancherial: నీటి లభ్యత మరియు ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 17 Aug 2026 4:48 PM IST
Mancherial
X

Mancherial: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి కలెక్టర్!

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల వైవిధ్యీకరణపై దృష్టి సారించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ విష్ణు ప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖతో కలిసి ఆయన మాట్లాడారు.

ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో పాటు భూగర్భ జలమట్టాలు తగ్గే పరిస్థితి ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌తో పాటు రానున్న రబీ సీజన్‌లోనూ నీటి లభ్యత విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలని సూచించారు.

ప్రస్తుతం ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో ఉన్న నీటికి మొదటి ప్రాధాన్యత తాగునీటి అవసరాలకే ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. గోల‍్లవాగు సహా ఇతర ప్రాజెక్టుల్లో వరి సాగుకు అవసరమైన స్థాయిలో నీరు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నారు. వరికి అవసరమయ్యే నీటితోనే మూడు నుంచి నాలుగు ఎకరాల్లో తక్కువ నీటితో సాగు చేసే పంటలను పండించవచ్చని వివరించారు.

నీటి కొరతతో వరి సాగు చేస్తే పంట ఎండిపోయే ప్రమాదంతో పాటు దిగుబడి, ధాన్యం నాణ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. అందువల్ల మొక్కజొన్న, కంది, పెసలు, మినుములు, అలసందులు వంటి తక్కువ నీటితో సాగు చేసే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు అవసరమైన విత్తనాలను అందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

నీటి లభ్యత, వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జూన్‌ 1 నుంచే రైతులకు పంటల ఎంపికపై అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. బోర్లపై ఆధారపడే రైతులు సైతం భూగర్భ జలమట్టాలు తగ్గిన నేపథ్యంలో నీటి సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.

రైతులు వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ, సాగునీటి శాఖల అధికారుల సూచనలు పాటిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. రైతులకు వాస్తవ పరిస్థితులను వివరించి పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించడంలో మీడియా కూడా భాగస్వాములు కావాలని ఆయన సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story