Mancherial: మంచిర్యాలలో పంటల కొనుగోలుకు పూర్తి సహకారం అందించాలి కలెక్టర్!

Mancherial: మంచిర్యాల జిల్లాలో పంటల కొనుగోలు, రవాణా ప్రక్రియకు లారీ యజమానులు పూర్తి సహకారం అందించాలని కోరిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. హెచ్చరిక జారీ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 16 Oct 2026 7:05 PM IST
Mancherial
X

Mancherial: మంచిర్యాలలో పంటల కొనుగోలుకు పూర్తి సహకారం అందించాలి కలెక్టర్!

Mancherial: జిల్లాలో పత్తి, వరి తదితర పంటల కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు లారీ యజమానులు, జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంటల కొనుగోలు, రవాణా ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన సమయంలో లారీలను అందుబాటులో ఉంచాలని, పంటలను సకాలంలో గమ్యస్థానాలకు తరలించేందుకు తగిన రవాణా సదుపాయాలు కల్పించాలని సూచించారు. పంటల కొనుగోలు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని తెలిపారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లారీ యజమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కొనుగోలు, రవాణా ప్రక్రియకు ఆటంకాలు కలిగించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు, లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల రద్దుకు చర్యలు చేపడతామని హెచ్చరించారు.

పంటల తరలింపునకు అవసరమైన రవాణా సదుపాయాలు కల్పించేందుకు అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాల నుంచి కూడా లారీలను జిల్లాలోకి అనుమతిస్తామని కలెక్టర్ వెల్లడించారు. జిల్లా లారీ అసోసియేషన్ ప్రతినిధులు, లారీ యజమానులు జిల్లా యంత్రాంగానికి సహకరించి, పంటల కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ఆయన కోరారు

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.