Mancherial: సింగరేణి బలోపేతానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

Mancherial: సింగరేణి సంస్థను బలోపేతం చేసి, ఉత్పత్తి వ్యయం తగ్గించడంతో పాటు బంగారం, లిథియం వంటి కీలక ఖనిజాల రంగంలోకి విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 25 Oct 2026 10:34 PM IST
Mancherial
X

Mancherial: సింగరేణి బలోపేతానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక

మంచిర్యాల: సింగరేణి కాలరీస్‌ సంస్థను బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు ఉపాధి భద్రత కల్పించేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు దిశానిర్దేశం చేశారు. బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఉత్పాదకతను పెంచడం, కొత్త గనులను అభివృద్ధి చేయడంతోపాటు రాగి, బంగారం, లిథియం, వెనేడియం వంటి కీలక ఖనిజాల అన్వేషణలోకి సంస్థ విస్తరించాలని సూచించారు.

సింగరేణి భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఆదివారం సింగరేణి సంస్థకు చెందిన 66 మంది జనరల్‌ మేనేజర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సింగరేణి సీఎండీ, ఛైర్మన్‌ డా. బుద్ధ ప్రకాష్‌ జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, కొత్త గనుల అభివృద్ధి, ఉత్పత్తి వ్యయ నియంత్రణ, సంస్థ భవిష్యత్తు విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ పనితీరుపై సమీక్షించారు.

సింగరేణి విస్తరణకు గత పదేళ్లలో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని, కొత్త బొగ్గు బ్లాకుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని భట్టి విక్రమార్క విమర్శించారు. గతంలో సంస్థ అభివృద్ధిని పట్టించుకోని వారే ఇప్పుడు సింగరేణి భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సంస్థకు నష్టం జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై గతంలో తీసుకున్న నిర్ణయాలను కూడా పరిశీలించాలని అన్నారు. సింగరేణిని కాపాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి, సంస్థ విస్తరణకు చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.

బొగ్గు బ్లాకుల కేటాయింపుపై కేంద్రంతో చర్చలు

సింగరేణికి గతంలో కేటాయించిన బొగ్గు బ్లాకులను వినియోగించుకునే అంశంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ, సింగరేణి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటోందన్నారు. సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జనరల్‌ మేనేజర్లు, కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు.

సుమారు 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు, 34 వేల నుంచి 36 వేల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆధారపడిన సింగరేణి మనుగడను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ఉత్పత్తి వ్యయం తగ్గితేనే మార్కెట్‌లో పోటీ

సింగరేణి బొగ్గు ఉత్పత్తి వ్యయం అధికంగా ఉంటే ఇతర సరఫరాదారులతో పోటీపడటం కష్టమవుతుందని భట్టి విక్రమార్క అన్నారు. తక్కువ ధరకు బొగ్గు లభించే చోట వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశముందని, దీనివల్ల సంస్థ మార్కెట్‌పై ప్రభావం పడుతుందని వివరించారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతోపాటు యంత్రాలు, సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

విద్యుత్‌ ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు కేటాయింపులు, సరఫరా ఒప్పందాలు, అందుబాటులో ఉన్న నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని ముందుగానే అంచనా వేయాల్సిన అవసరం ఉందన్నారు. బొగ్గు నాణ్యత, గ్రేడ్‌కు అనుగుణంగానే సరఫరా చేయాల్సి ఉంటుందని తెలిపారు. సంస్థ లాభదాయకంగా కొనసాగితేనే కార్మికులకు, వారి కుటుంబాలకు భరోసా కల్పించగలమని పేర్కొన్నారు.

కీలక ఖనిజాల అన్వేషణలోకి సింగరేణి

భవిష్యత్తులో బొగ్గుపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ రంగాల్లోకి కూడా సింగరేణి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. సౌర విద్యుత్‌, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, పంప్డ్‌ స్టోరేజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు డిమాండ్‌లో వచ్చే మార్పులను ముందుగానే అంచనా వేయాలన్నారు.

శతాబ్దానికి పైబడిన గనుల తవ్వకం అనుభవాన్ని ఉపయోగించుకుని రాగి, బంగారం, వెనేడియం, లిథియం వంటి కీలక ఖనిజాల అన్వేషణ, తవ్వకాల అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్ల సేవలను వినియోగించుకుని, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసిన తర్వాత పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం

సింగరేణి సంస్థను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని సీఎండీ, ఛైర్మన్‌ డా. బుద్ధ ప్రకాష్‌ జ్యోతి పిలుపునిచ్చారు. సంస్థ చరిత్రలో తొలిసారిగా ఈ తరహా జనరల్‌ మేనేజర్ల ఇంటరాక్షన్‌ కార్యక్రమాన్ని నిర్వహించడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశంలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. జైపూర్‌లో కొత్త థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ఏర్పాటు సహా సంస్థ విస్తరణపై దృష్టి సారించినట్లు వివరించారు. రెగ్యులర్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా 2023 డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు సంస్థ సాధించిన ప్రగతిపై నివేదికను ప్రదర్శించడంతోపాటు, సింగరేణి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వీడియో రూపంలో వివరించారు. సంస్థ అభివృద్ధికి అవసరమైన సూచనలు అందించాలని, క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను ప్రతిపాదించాలని జనరల్‌ మేనేజర్లకు ఉప ముఖ్యమంత్రి సూచించారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.