Mancherial: పొగమంచుతో కప్పుకున్న కవ్వాల్ అడవులు.. కాశ్మీర్‌ను తలపిస్తున్న అందాలు!

Mancherial: మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని జన్నారం అటవీ ప్రాంతం దట్టమైన పొగమంచుతో కాశ్మీర్‌ను తలపిస్తోంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 22 Nov 2026 9:45 AM IST
Mancherial
X

Mancherial: పొగమంచుతో కప్పుకున్న కవ్వాల్ అడవులు.. కాశ్మీర్‌ను తలపిస్తున్న అందాలు!

Mancherial: జిల్లాలో చలికాలం ప్రభావం క్రమంగా పెరుగుతోంది. కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని జన్నారం అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున, రాత్రి వేళల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. అడవులు, రహదారులు మంచు తెరలతో కప్పుకోవడంతో ప్రకృతి అందాలు సరికొత్తగా దర్శనమిస్తున్నాయి. పొగమంచుతో నిండిన అటవీ ప్రాంతం సుందర కాశ్మీర్‌ను తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది.

ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండటంతో అటవీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం వేళల్లో చెట్లు, రహదారులపై పొగమంచు అలుముకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నప్పటికీ.. ప్రయాణికులకు మాత్రం పొగమంచు ఇబ్బందులు కలిగిస్తోంది.

ముఖ్యంగా అటవీ మార్గాల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉంది. పొగమంచు సమయంలో వేగంగా ప్రయాణించడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పొగమంచు కమ్ముకున్న సమయంలో వాహన వేగాన్ని తగ్గించాలని, లో బీమ్ లైట్లు వినియోగించాలని, ముందు వెళ్తున్న వాహనానికి తగిన దూరం పాటించాలని సూచిస్తున్నారు. రహదారిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ప్రయాణాన్ని కొంతసేపు వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఓవైపు చలి తీవ్రత.. మరోవైపు పొగమంచు తెరలతో జన్నారం అటవీ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తుండగా.. రహదారులపై ప్రయాణించే వారు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.