Bellampalli: బెల్లంపల్లి నియోజకవర్గంలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం
Bellampalli: బెల్లంపల్లి నియోజకవర్గం బుధ కుర్ద్ పంచాయతీలో రికార్డులు లేకుండా 16 మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ అయిన భాగోతంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. కంప్యూటర్ ఆపరేటర్ పరారయ్యారు.
Bellampalli: బెల్లంపల్లి నియోజకవర్గంలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాల కలకలం
బెల్లంపల్లి: బెల్లంపల్లి నియోజకవర్గం బుధ కుర్ద్ గ్రామపంచాయతీలో మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి అధికారిక దరఖాస్తులు, రికార్డులు లేకుండానే రహస్యంగా మరణ ధృవీకరణ పత్రాలు జారీ కావడం స్థానికంగా గందరగోళానికి దారితీసింది.
బుధ కుర్ద్ గ్రామ పంచాయతీకి చెందిన సెక్రటరీ అనారోగ్యంతో సెలవులో ఉండటంతో, కన్నాల పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్‌ను ఇక్కడికి ఇన్చార్జి సెక్రటరీగా నియమించారు. అయితే, సెలవులో ఉన్న సాదుల్ల సెక్రటరీ డిజిటల్ కీ ద్వారా ఈ సర్టిఫికెట్లు మంజూరు కావడం గమనార్హం. ఈ విషయం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ఇన్చార్జి సెక్రటరీ శ్రీనివాస్ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
ఈ భాగోతంపై నిలదీసేందుకు అధికారుల ముందుకు పిలిపించిన సమయంలో, కంప్యూటర్ ఆపరేటర్ మెల్లగా అక్కడి నుంచి జారుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్లు సమాచారం . మొత్తం 16 సర్టిఫికెట్లకు సంబంధించి ఎలాంటి రిజిస్టర్ నమోదు కాలేదని, ఇవి ఎవరి కోసం సిద్ధం చేశారనే దానిపై గ్రామస్థుల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని ఖాళీ భూములను కబ్జా చేసేందుకే చనిపోయిన వ్యక్తుల పేర్లతో వేరే వ్యక్తులు ఈ పత్రాలను సృష్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ ఈ వ్యవహారం అంతటిలో 1989లో చనిపోయిన ఒక వ్యక్తికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం సెప్టెంబర్ 29, 2026 తేదీన జారీ అయినట్లుగా ఉంది. అయితే గ్రామస్తులు మాత్రం అతను మా ఊరు కారడు కాదని అతని ఎవరో తెలవదని ఎవరి ఇంటికాడ చనిపోయాడా కూడా తెలవదని ఎవరికి బంధువు అయితాడో కూడా తెలవదని ఆరోపణ చేస్తున్నారు... అలాంటి వాడికి ఇక్కడ ఎలా సర్టిఫికెట్ జారీ చేశారని ప్రశ్నిస్తున్నారు.
ఈ అక్రమాల వెనుక అసలు నిజాలు తేల్చేందుకు, ఈ మరణ ధృవీకరణాల భాగోతంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరపాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు లేకుండా జారీ అయిన ఈ సర్టిఫికెట్ల వ్యవహారంపై ఇన్చార్జి సెక్రటరీ పోలీసులకు మరియు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు రంగం సిద్ధమైంది. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం గమనార్హం.




