Mancherial: అక్రమ మరణ ధృవీకరణ పత్రాల దందా.. ఐదుగురు అరెస్ట్, ఒకరు పరారీ!

Mancherial: మంచిర్యాల జిల్లాలో డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా 27 మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 22 Nov 2026 7:02 AM IST
Mancherial
X

Mancherial: అక్రమ మరణ ధృవీకరణ పత్రాల దందా.. ఐదుగురు అరెస్ట్, ఒకరు పరారీ!

Mancherial: మంచిర్యాల జిల్లాలో అనధికారికంగా మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సంతకాల (డీఎస్సీ)ను దుర్వినియోగం చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

బెల్లంపల్లి మండలంలో అనధికార మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన వ్యవహారంపై ఈ నెల 17న మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) గుమ్ముల కృష్ణవేణి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు, ఎంపీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న చిందం శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు అతని ఆధీనంలో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులకు ఆశపడి అనధికార ధృవీకరణ పత్రాలు జారీ చేసినట్లు తేలింది.

బుధ ఖుర్దు గ్రామంలో మొత్తం 16 మరణ ధృవీకరణ పత్రాలు అక్రమంగా జారీ చేయగా, వాటిలో 11 పత్రాల జారీకి గ్రామ కారోబార్ చిందం రవి సహకరించినట్లు విచారణలో వెల్లడైంది. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. సాదుల్లా పంచాయతీ కార్యదర్శి సెలవులో ఉన్న సమయంలో, అతని డిజిటల్ సంతకాన్ని దుర్వినియోగం చేస్తూ, అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న కార్యదర్శి లాగిన్ ద్వారా ఈ పత్రాలను జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదే కాకుండా పెర్కపల్లి గ్రామ పంచాయతీలో మరో 11 మరణ ధృవీకరణ పత్రాలను ఎలాంటి అనుమతి లేకుండా జారీ చేసినట్లు గుర్తించారు. వీటిలో ఒకటి పెర్కపల్లికి సంబంధించినది కాగా, మిగిలిన పది పత్రాలు పెద్దపల్లి జిల్లాకు చెందినవిగా వెల్లడైంది. స్నిగ్ధ పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకాన్ని దుర్వినియోగం చేస్తూ, ప్రస్తుత కార్యదర్శి సాయిరాం లాగిన్ ద్వారా ఈ పత్రాలు జారీ చేసినట్లు విచారణలో తేలింది.

ఈ అక్రమ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వైకుంఠంతో పాటు గోదావరిఖని ప్రాంతానికి చెందిన రామగుండం మున్సిపాలిటీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆనంద్, సాగర్, మీ సేవ ఆపరేటర్ నరేందర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ధృవీకరణ పత్రానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేసినట్లు వెల్లడించారు.

ఈ కేసులో కంప్యూటర్ ఆపరేటర్ చిందం శ్రీనివాస్, రవి, ఆనంద్, సాగర్, నరేందర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ వైకుంఠం పరారీలో ఉన్నట్లు తెలిపారు. అక్రమంగా జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రాల వెనుక పెద్ద మొత్తంలో డబ్బుల వసూళ్లు జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.