Raipur: తుపాకీ పట్టిన చేతులు.. ఇప్పుడు చేనేత మగ్గంపై..

Raipur: అడవి బాట వీడి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టిన మాజీ మహిళా మావోయిస్టులు. రాయ్‌పూర్‌లో జరిగిన చేనేత దినోత్సవంలో ఫ్యాషన్ ర్యాంప్ వాక్ చేసి ప్రత్యేక ఆకర్షణ.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 13 Aug 2026 9:16 PM IST
Raipur
X

Raipur: తుపాకీ పట్టిన చేతులు.. ఇప్పుడు చేనేత మగ్గంపై..

రాయ్‌పూర్: ఒకప్పుడు బస్తర్‌ అడవుల్లో తుపాకులు పట్టుకుని సంచరించిన చేతులు.. ఇప్పుడు చేనేత మగ్గంపై సంప్రదాయ వస్త్రాలను నేస్తున్నాయి. పోలీసుల కళ్లుగప్పి అడవుల్లో తిరిగిన అడుగులు.. ఇప్పుడు అదే ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్‌ ర్యాంప్‌పై ముందుకు సాగుతున్నాయి. ఇది మారిన జీవితానికి, మార్పును ఎంచుకున్న మనిషి ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన ఘటన.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన వీరు.. ఆ తర్వాత ప్రభుత్వానికి లొంగిపోయి సాధారణ జీవనంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు తమ గతాన్ని వెనక్కి నెట్టి.. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్వయం ఉపాధి, చేనేత వంటి రంగాల్లో ముందుకు సాగుతున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షోలో మాజీ మహిళా మావోయిస్టులు సంప్రదాయ ఛత్తీస్‌గఢ్‌ చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్‌పై నడిచారు. కోసా పట్టు, చేతితో నేసిన సాంప్రదాయ వస్త్రాలతో వారు ర్యాంప్‌పై ప్రదర్శన ఇచ్చారు. వారి నడకలో కనిపించిన ఆత్మవిశ్వాసం.. గత జీవితానికి భిన్నంగా కొత్త భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని చాటిచెప్పింది.

కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయ్‌ హాజరయ్యారు. ర్యాంప్‌ వాక్‌ చేసిన మాజీ మహిళా మావోయిస్టులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఎంచుకున్న కొత్త జీవన మార్గాన్ని అభినందిస్తూ.. భవిష్యత్తులో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

హింసా మార్గం నుంచి సాధారణ జీవితం వైపు..

మాజీ మహిళా మావోయిస్టుల ఈ మార్పు కేవలం వారి జీవితాల్లో వచ్చిన పరివర్తన మాత్రమే కాదు.. మార్పును కోరుకునే వారికి ఒక బలమైన సందేశంగా నిలుస్తోంది. ముఖ్యంగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న వారు కూడా హింసను వీడి సమాజంలోకి తిరిగి వచ్చి గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించవచ్చనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగిస్తోంది.

గతంలో తుపాకీ మోసిన చేతులే ఇప్పుడు చేనేతకు అండగా నిలవడం.. అడవుల్లో నడిచిన అడుగులే ఇప్పుడు ర్యాంప్‌పై కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడం.. నిజంగా మార్పు అంటే ఇదేనంటూ ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.

Next Story