Mancherial: గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు: శైలజ రామయ్యర్ ఆదేశం!
Mancherial: గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలజ రామయ్యర్ సమీక్ష మంచిర్యాల జిల్లాలో 5 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లు అదనపు కలెక్టర్ చంద్రయ్య.
Mancherial: గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు: శైలజ రామయ్యర్ ఆదేశం!
మంచిర్యాల, అక్టోబర్ 3: రాష్ట్రంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు అవసరమైన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (రెవెన్యూ, దేవాదాయ) శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు.
శనివారం హైదరాబాద్ నుంచి జూమ్ సమావేశం ద్వారా గోదావరి నది పరివాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో పుష్కర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
పుష్కర ఘాట్ల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య శిబిరాలు, గజ ఈతగాళ్లు, బందోబస్తు, రహదారులు, పార్కింగ్ తదితర సౌకర్యాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేసి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఐదు ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల ఏర్పాట్లు
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో గోదావరి పుష్కరాలను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని మంచిర్యాల, గూడెం, లక్షెట్టిపేట, వేలాల, చెన్నూర్ ప్రాంతాల్లో పుష్కర ఘాట్ల ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ఘాట్ల వద్దకు భక్తులు సులభంగా చేరుకునేలా రహదారులు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
పుష్కర స్నానాల కోసం సమీప జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.




