Mancherial: హనుమాన్ మందిరంలో సమృద్ధి వర్షాల కోసం బిందెలతో జలాభిషేకం!
Mancherial: మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలో హనుమాన్ మందిరంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ మహిళల జలాభిషేకం, ప్రత్యేక పూజలు.
Mancherial: హనుమాన్ మందిరంలో సమృద్ధి వర్షాల కోసం బిందెలతో జలాభిషేకం!
Mancherial: వర్షాలు సమృద్ధిగా కురిసి గ్రామంలో పాడిపంటలు చల్లగా ఉండాలని, రైతాంగం సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భీమారం మండలం ఒడ్యాడ్ గ్రామంలోని హనుమాన్ మందిరంలో సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, నిండు బిందెలతో నీటిని ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి జలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, వాగులు జలకళతో ఉప్పొంగాలని, పంటలు పుష్కలంగా పండాలని వేడుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే వ్యవసాయ రంగానికి ఎంతో మేలు జరుగుతుందని, పాడి పంటలు వృద్ధి చెంది రైతులు, కూలీల కుటుంబాల్లో ఆనందం నెలకొంటుందని మహిళలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతిని గౌరవిస్తూ నీటి వనరులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దమనుషులు, మహిళలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




