Kagaznagar: బీఆర్‌ఎస్ నిరసన 'బాకీ కార్డులు' పంపిణీ చేసిన కోనప్ప!

Kagaznagar: కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్యాలపై మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నిరసన. 'బాకీ కార్డుల' పంపిణీ, నిరసన ప్రదర్శన.

LALITH KUMAR, SIRPUR
Published on: 2 Sept 2026 4:26 PM IST
Kagaznagar
X

Kagaznagar: బీఆర్‌ఎస్ నిరసన 'బాకీ కార్డులు' పంపిణీ చేసిన కోనప్ప!

Kagaznagar: కొమరం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కోనేరు కోనప్ప మాట్లాడుతూ, వృద్ధాప్య పింఛన్ రూ.4,000 ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతుల ఆత్మహత్యలు, గురుకుల విద్యార్థుల మరణాలు, చేనేత కార్మికులు, ఆటో కార్మికుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. మూడు లక్షల 75 వేల మంది పింఛన్లలో కోత విధించారని, కళ్యాణలక్ష్మి, రైతు బీమా వంటి పథకాలు నిలిచిపోయాయని, రైతుబంధు సక్రమంగా అమలు చేయలేదని, దళితబంధును ప్రారంభించలేదని విమర్శించారు.

పాలిటెక్నిక్ విద్యార్థుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు అనేక వర్గాలు ధర్నాలు చేస్తున్నాయని, యూనివర్సిటీ భూముల నుంచి ప్రాజెక్టుల ఇసుక వరకు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఒక్క చెక్‌డ్యామ్ కూడా నిర్మించలేదని, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, నీటి వనరుల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పడిపోతుండగా రాష్ట్రంలో నేరాల రేటు పెరిగిందని విమర్శించారు.

“100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. కానీ 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్ద కాలం వెనక్కి నెట్టారు” అని కోనేరు కోనప్ప విమర్శించారు.

అలాగే, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ధర్నాలు చేయని వర్గమంటూ లేదని, మోసం చేయని రంగమంటూ లేదని ఆరోపించారు.

“ఆరు గ్యారంటీలకు, 420 హామీలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి 1000 రోజులు పూర్తి అయినా, వాటి అమలుకు చెప్పిన 100 రోజులు మాత్రం ఇంకా పూర్తి కాలేదు” అని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా కాగజ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాకీ కార్డులను పంపిణీ చేసి నిరసన తెలిపారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR

Next Story