Kagaznagar: బియ్యం బస్తాల్లో కిలో తక్కువ: వ్యాపారులపై అధికారుల కొరడా!

Kagaznagar: కాగజ్‌నగర్ గోల్ బజార్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 26 కిలోల బియ్యం బస్తాల్లో కిలో తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌పై కేసు నమోదు చేశారు.

LALITH KUMAR, SIRPUR
Published on: 4 Nov 2026 7:47 PM IST
Kagaznagar
X

Kagaznagar: బియ్యం బస్తాల్లో కిలో తక్కువ: వ్యాపారులపై అధికారుల కొరడా!

కాగజ్‌నగర్: బియ్యం వ్యాపారులు వినియోగదారులను మోసం చేస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. బియ్యం బస్తాల తూకాల్లో అక్రమాలు, తూనికలు, కొలతల్లో నిబంధనల ఉల్లంఘనలపై పౌరసరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ, మున్సిపల్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని గోల్ బజార్‌లో బుధవారం నిర్వహించిన ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో అక్రమాలు వెలుగుచూశాయి. 26 కిలోలుగా ముద్రించిన బియ్యం బస్తాల్లో కేవలం 25 కిలోల బియ్యం మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పాటు తూనికలు, కొలతలు, వ్యాపార లైసెన్సులకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో సతీష్ కిరాణా, వైద్య రవికుమార్ కిరాణా, బుక్క రాములు కిరాణా, పండరినాథ్ దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు కాగజ్‌నగర్‌లోని రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌లోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి తూనిక యంత్రంలో వ్యత్యాసాలను గుర్తించిన లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వ్యాపార సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వినియోగదారులకు సరైన తూకంతో వస్తువులు విక్రయించాలని, తూనికలు, కొలతల్లో ఎలాంటి అక్రమాలకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారుల హక్కులను కాపాడేందుకు తనిఖీలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ తనిఖీల్లో డీసీఎస్‌ఓ వాజిద్ అలీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ రాజ్‌కుమార్, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ అజీజ్ పాషా, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR