Kagaznagar: కాగజ్‌నగర్‌లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
Kagaznagar: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా 8,486 మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు. కాగజ్‌నగర్‌లో పంపిణీ చేసిన కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు.
Kagaznagar: కాగజ్‌నగర్‌లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ
కాగజ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్లు పేదలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోందని తెలిపారు.
గురువారం కాగజ్‌నగర్ పురపాలక కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, సబ్ కలెక్టర్ హర్ష చౌదరి, మున్సిపల్ చైర్‌పర్సన్ పర్వీన్ సుల్తానా, వైస్ చైర్‌పర్సన్ కొత్తపల్లి అనితతో కలిసి కలెక్టర్ కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న పేదలకు కొత్తగా పింఛన్లు మంజూరు కావడం ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో 871 మందికి, కాగజ్‌నగర్ మండలంలోని గ్రామపంచాయతీల పరిధిలో 781 మందికి కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 8,486 మంది కొత్త లబ్ధిదారులకు చేయూత పింఛన్లు మంజూరు కావడం సంతోషకరమన్నారు. దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, వయసు పైబడిన గీత కార్మికులకు ఈ పింఛన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఆర్థిక భరోసాతో పాటు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు చేయూత పింఛన్లు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఎంపీడీవో, కౌన్సిలర్లు, సర్పంచులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




