Kagaznagar: కాగజ్‌నగర్ టౌన్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ!

Kagaznagar: కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ అంబర్ కిషోర్ ఝా. సెప్టెంబర్ 25 గణేష్ నిమజ్జనం బందోబస్తు, సీసీటీఎన్‌ఎస్ రికార్డులు, శాంతిభద్రతలపై సమీక్ష.

LALITH KUMAR, SIRPUR
Published on: 22 Sept 2026 5:46 PM IST
Kagaznagar
X

Kagaznagar: కాగజ్‌నగర్ టౌన్ పీఎస్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ!

కాగజ్‌నగర్: కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ సబ్ డివిజన్ పరిధిలోని కాగజ్‌నగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను కాళేశ్వరం జోన్-I డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీఐజీ ముందుగా స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది పనితీరును, స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు.

అనంతరం సీఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు,రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు.స్టేషన్ పరిధిలో తరచుగా నమోదయ్యే నేరాలు,గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతల పరిస్థితి,స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై సీఐను అడిగి తెలుసుకున్నారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులు మరియు ప్రజలకు అందిస్తున్న సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రౌడీషీటర్లు,సస్పెక్ట్ షీట్‌లలో ఉన్న వ్యక్తులు,నేర చరిత్ర కలిగిన వ్యక్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి,వారి కదలికలు, కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

డీఐజీ మాట్లాడుతూ,ఈ నెల 25న జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సీఐ, డీఎస్పీ అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి గతంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యాత్మక ప్రాంతాలు,గత అనుభవాలు తదితర అంశాలపై అధికారులు వివరించారని తెలిపారు.నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా ముందస్తు చర్యలు, బందోబస్తు ఏర్పాట్లు, పోలీస్ సిబ్బంది సమన్వయం తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో సీసీటీఎన్‌ఎస్ (CCTNS) పనితీరు, డేటా అప్‌డేట్స్‌ను పరిశీలించినట్లు తెలిపారు.ప్రస్తుతం పోలీసింగ్ వ్యవస్థలో సీసీటీఎన్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తున్నందున, కేసుల నమోదు, దర్యాప్తు,నేరస్థుల వివరాల నిర్వహణ తదితర అంశాల్లో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు.

రౌడీషీటర్లు,క్రిమినల్ రికార్డు ఉన్న వ్యక్తులపై క్రమం తప్పకుండా నిఘా కొనసాగించాలని, వారి కదలికలను పర్యవేక్షిస్తూ రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహించాలని ఎస్‌హెచ్‌ఓకు సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీలో కాగజ్‌నగర్ సబ్ డివిజన్ డీఎస్పీ,సీఐ ప్రేమ్ కుమార్,ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR