Mancherial: గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో మూడు రోజుల కార్తీక పౌర్ణమి వేడుకలు!

Mancherial: దండేపల్లి మండలంలోని గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో నవంబర్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Published on: 22 Nov 2026 11:03 AM IST
Mancherial
X

Mancherial: గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో మూడు రోజుల కార్తీక పౌర్ణమి వేడుకలు!

Mancherial: కార్తీక మాస పవిత్రత.. పౌర్ణమి పర్వదిన వేళ గూడెం శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ఆధ్యాత్మిక వేడుకలకు సిద్ధమైంది. దండేపల్లి మండలంలోని గోదావరి తీరాన వెలసిన ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో నవంబర్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు కార్తీక పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞ కార్యక్రమాలతో ఆలయం భక్తి పారవశ్యంలో మునిగిపోనుంది.

కార్తీక మాసంలో గూడెం క్షేత్రానికి విశేష ప్రాధాన్యత ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించేలా ఆలయాన్ని ముస్తాబు చేయడంతో పాటు దర్శన, పూజా కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు

ఆదివారం కార్తీక శుద్ధ త్రయోదశి సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పూజ, పుణ్యాహవాచనం, అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠ, మూలమంత్ర హవనాలు, బలిహరణం, తీర్థప్రసాద వితరణ నిర్వహించనున్నారు. సాయంత్రం గోధూళి వేళ తులసి కల్యాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

సోమవారం కార్తీక శుద్ధ చతుర్దశి సందర్భంగా నిత్య హవనంతో పాటు ప్రత్యేక పూజలు, బలిహరణం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మంగళవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన నిత్య హవనం, బలిహరణం, మహాపూర్ణాహుతి, యజ్ఞ పరిసమాప్తి, మహా ఆశీర్వచనం తదితర కార్యక్రమాలతో ఉత్సవాలను ఘనంగా ముగించనున్నారు.

భక్తులకు విస్తృత ఏర్పాట్లు

కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది భక్తులు గూడెం క్షేత్రానికి వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ పరిసరాలను శుభ్రపరిచి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తూ, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించనున్నాయి. కార్తీక దీపాల వెలుగులు, వేద మంత్రోచ్ఛారణలు, ప్రత్యేక హోమాలు, తులసి కల్యాణంతో గూడెం ఆలయం భక్తి శోభతో విరాజిల్లనుంది.

ఉత్సవాల నిర్వహణకు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గోవర్ధన రఘుస్వామి, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ గౌడ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.