Asifabad: ఆసిఫాబాద్లో కిసాన్ మేళా: ఆధునిక సాగుపై అవగాహన!
Asifabad: ఆసిఫాబాద్లో కిసాన్ మేళా ఘనంగా జరిగింది. కలెక్టర్ కె. హరిత, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు రైతులను ఉద్దేశించి ఆధునిక సాగు పద్ధతులపై సూచనలు చేశారు.
Asifabad: ఆసిఫాబాద్లో కిసాన్ మేళా: ఆధునిక సాగుపై అవగాహన!
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగులో మార్పులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధునిక సాగు పద్ధతులు, నూతన వంగడాలు, ప్రభుత్వ సబ్సిడీలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ.. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి పొదుపుపై రైతులకు సూచనలు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో వరి సాగు విస్తీర్ణాన్ని 25 శాతం వరకు తగ్గించగలిగామని పేర్కొన్నారు. రైతులు కిసాన్ మేళాలో అందిస్తున్న సలహాలు, సూచనలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరోవైపు, రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ యాసంగి సీజన్లో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవాలని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు విధానాల్లో మార్పులు చేసుకోవాలని రైతులకు సూచించారు.




