Asifabad: గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్: ఆసిఫాబాద్ పోలీసులు!
Asifabad: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి 150 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
Asifabad: గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్: ఆసిఫాబాద్ పోలీసులు!
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో గంజాయి అక్రమ కొనుగోళ్లు, విక్రయాలపై ఆసిఫాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 150 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.7,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.
జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ నెల 11న ఆసిఫాబాద్ ఎస్‌ఐ ఎం. బోజ్జి రావుకు అందిన విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాజుల అజయ్, నాగపురి విష్ణులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 100 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో ఈస్‌గాం గ్రామానికి చెందిన సుజీత్ మండల్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు వారు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గుండి ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు చేపట్టి మాచర్ల అశోక్, బోయిరె వినేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. అశోక్ వద్ద నుంచి మరో 50 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు.
ఈ రెండు ఘటనలకు సంబంధించి మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఆసిఫాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్. రవి తెలిపారు.
గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ కొనుగోళ్లు, విక్రయాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.




